శ‌ర‌త్ మ‌రార్.. డ‌బ్బింగ్ రాయుడు..

శ‌ర‌త్ మ‌రార్.. ఈయ‌న నిర్మాత కంటే కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహితుడిగానే ఎక్కువ మందికి తెలుసు. ప‌వ‌న్ తో స‌ర్దార్, కాట‌మ‌రాయుడు సినిమాలు నిర్మించాడు శ‌ర‌త్ మరార్. సినిమాలు ఫ్లాపైనా ఆయ‌న‌కు పోయిందేమీ లేదు. ముందే బిజినెస్ చేసుకుని సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. అయితే ఈయ‌న తెలుగులో ఒక్క ప‌వ‌న్ తో త‌ప్ప మిగిలిన హీరోల‌తో సినిమాలు నిర్మించేట్లు క‌నిపించ‌ట్లేదు. పైగా ఈ మ‌ధ్య ప‌వ‌న్ తో కాస్త దూరంగా ఉంటున్నారు ఈయ‌న‌. దాంతో మ‌రో దారి చూసుకుంటున్నాడు శ‌ర‌త్ మరార్. హాయిగా డ‌బ్బింగ్ సినిమాల‌ను ఇక్క‌డ త‌న బ్రాండ్ వ్యాల్యూతో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడు శ‌ర‌త్.

ఇప్ప‌టికే ఈయ‌న విడుద‌ల చేసిన అదిరింది తెలుగులోనూ మంచి విజ‌యం సాధించింది. విజ‌య్ కెరీర్ లోనే తొలిసారి ఈ చిత్రానికి తెలుగులో 9.5 కోట్ల గ్రాస్.. 5.50 కోట్ల షేర్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మ‌రార్ షేర్ ప్రాసెస్ పై తీసుకున్నారు. అంతా క‌లిపి ఆయ‌న‌కు ఇక్క‌డ ప్ర‌మోష‌న్ ఖ‌ర్చు 3 కోట్ల‌కు కూడా మించ‌లేదు. అంటే సినిమాపై 2 కోట్ల‌కు పైగా లాభం అన్న‌మాట‌. దాంతో ఇప్పుడు మ‌రో సినిమాను తీసుకున్నారు ఈయ‌న‌. అదే న‌య‌న‌తార న‌టించిన ఆర‌మ్. తెలుగులో క‌ర్త‌వ్యంగా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో విడుద‌ల చేస్తున్నాడు శ‌ర‌త్ మ‌రార్. ఈ చిత్రం మాత్ర‌మే కాదు.. మ‌రో మూడు డ‌బ్బింగ్ సినిమాల రైట్స్ కూడా తీసుకున్నారు శర‌త్ మ‌రార్. ఇవ‌న్నీ చూస్తుంటే ఇక‌పై ఈ కాట‌మ‌రాయుడు కాస్తా డ‌బ్బింగ్ రాయుడుగా మారిపోయేలా ఉన్నాడు.