ప‌వ‌న్ ఖాతాలో మ‌రో గౌర‌వం..

ప‌వన్ క‌ళ్యాణ్ కు న‌టుడిగా ఎన్ని అవార్డులు వ‌చ్చాయో తెలియ‌దు కానీ.. బ‌య‌ట మాత్రం ఆయ‌న హ్యూమానిటికి బోలెడ‌న్ని అవార్డులొస్తున్నాయి.  పిలిచి మ‌రీ విదేశీ యూనివ‌ర్సిటీలు కూడా ప‌వ‌ర్ స్టార్ ను స‌త్క‌రించుకుంటున్నాయి. ఆ మ‌ధ్య అమెరికా వెళ్లొచ్చిన ప‌వ‌న్.. ఇప్పుడు లండ‌న్ వెళ్తున్నాడు. ప్ర‌స్తుతం బ‌ల్గేరియాలో త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అక్క‌డ్నుంచి లండ‌న్ వెళ్తున్నాడు. న‌వంబ‌ర్ 15న లండ‌న్ చేరుకోనున్నాడు ప‌వ‌ర్ స్టార్. అక్క‌డే ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఎక్సలెన్స్‌ అవార్డును ప‌వ‌న్ అందుకోనున్నారు. ఇండియా, యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం (ఐ.ఇ.బి.ఎఫ్‌) ఈ అవార్డును ఆయనకు ప్రధానం చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అవార్డు స్వీక‌ర‌ణ‌తో పాటు ఈ నెల 17, 18 తేదీల్లో లండన్‌లో జ‌ర‌గ‌బోయే వివిధ కార్యక్రమాల్లో ఆయ‌న పాల్గొననున్నారు.

దానికి తోడు తెలుగు స‌మ్మేళ‌నంలోనూ ప‌వ‌న్ ముఖ్య అతిథిగా సంద‌డి చేయ‌నున్నారు. దీనికోసం ఇప్ప‌టికే లండ‌న్ లోని తెలుగు సంఘాల‌న్నీ ప‌వ‌న్ కు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌వ‌న్ షెడ్యూలింగ్ కూడా పూర్తైపోయింది. ఈయ‌న 17, 18 తేదీల్లో లండ‌న్ లోని వెస్ట్‌ మినిస్టర్‌ పోర్టుక్యూలిస్‌ హౌస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో జరగబోయే సభలలో పాల్గొననున్నారు. 18న అక్క‌డి వివిధ యూనివర్శిటీలకు వెళ్లి.. అక్క‌డి విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం లండ‌న్ లోని ప్ర‌ఖ్యాత వెస్ట్‌ మినిస్టర్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లోని కింగ్స్‌ మెడికల్‌ కళాశాలలో జరగనుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అట్నుంచి అటే బ‌ల్గేరియా వెళ్ల‌నున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. న‌వంబ‌ర్ 20 నుంచి మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ సినిమా సెట్లో అడుగు పెట్ట‌నున్నాడు ప‌వ‌ర్ స్టార్.