ప‌వ‌న్ సినిమా రీమేక్ కాదు… ఎలాంటి పాత్రంటే?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే అభిమానులు `గ‌బ్బ‌ర్‌సింగ్‌` సినిమాని గుర్తు చేసుకుంటూ… దానికి దీటుగా అంచ‌నాలు పెంచుకోవ‌డం, ఆ సినిమా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవ‌డం మొద‌లైంది. `గ‌బ్బ‌ర్‌సింగ్` అప్ప‌ట్లో ఒక సంచ‌ల‌నం సృష్టించింది. అందులో ప‌వ‌న్‌ని చూపించిన విధానం అభిమానుల్ని ఎంత‌గానో మెప్పించింది. మాస్ అవ‌తారంలో ప‌వ‌న్ చేసిన హంగామా, ఆయ‌న చెప్పిన సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. అది హిందీ చిత్రం `ద‌బాంగ్‌`కి రీమేకే అయినప్ప‌టికీ… స్ట్ర‌యిట్ సినిమా అనిపించేలా త‌న మార్క్ మార్పుల‌తోనూ, త‌న మార్క్ ర‌చ‌నతోనూ హ‌రీష్ శంక‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ – హ‌రీష్‌ల సినిమా అనేస‌రికి మ‌రోసారి రీమేక్‌కే వెళ‌తారా? అదే సేఫ్‌గేమ్ అనుకుంటున్నారా? అనే చర్చ మొద‌లైంది. అయితే హ‌రీష్‌శంక‌ర్ మాత్రం తాను రీమేక్ చేయ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చేశాడు. స్ట్ర‌యిట్ క‌థ‌తోనే, ప‌వ‌న్ ఇంత‌కుముందు చేసిన పాత్ర‌ల కంటే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించేలా స్క్రిప్టుని తీర్చిదిద్దుతున్నాడ‌ట హ‌రీష్‌శంక‌ర్‌. అదొక ఒక విప్ల‌వ కారుడి పాత్ర అట‌. అత‌ని క‌థ‌తోనే సినిమాని తీర్చిదిద్ద‌బోతున్నాడ‌ట హ‌రీష్‌. మ‌రి అది నిజ‌మో కాదో తెలియాలంటే మ‌రికొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.