ప‌వ‌న్ ఇక నిజంగానే గుడ్ బై

ఏమో ఇన్నాళ్లూ ఒక్క సినిమా అయినా చేస్తాడేమో అనే ఆశ‌లుండేవి. కానీ రోజురోజుకీ ఆ ఆశ‌లు ఆవిరైపోతున్నాయి. ప‌వ‌న్ తీరు చూస్తే ఇప్పుడే కాదు.. ఎప్పుడూ సినిమాలు చేసేలా క‌నిపించ‌ట్లేదు. పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యేలా క‌నిపిస్తున్నాడు. అస‌లు త‌న‌కు సినిమా అంటేనే ఆస‌క్తి లేద‌న్న‌ట్లు.. ఎవ‌రైనా సినిమా టాపిక్స్ తీసుకొచ్చినా తాను సుముఖంగా లేన‌ని.. ద‌యచేసి ఆ వార్త‌లు ఇక్క‌డ వ‌ద్దంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇదంతా చూస్తుంటే ఇక ప‌వ‌ర్ స్టార్ కు సినిమాల‌తో రుణం తీరిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మైత్రి మూవీ మేక‌ర్స్ తో ఓ సినిమా చేస్తాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఇది కూడా అట‌కెక్కిన‌ట్లుగానే క‌నిపిస్తుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ ను మ‌రో సినిమా చూసుకోవాల్సిందిగా చెప్పారు మైత్రి సంస్థ‌.

ప‌వ‌న్ ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ వేడుక‌ల్లో ఉన్నారు. ఈ పార్టీ ప్లీన‌రీ స‌మావేషాల‌తో జ‌నాల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అడిగిన ప్ర‌శ్న‌కు ఇక‌పై తాను సినిమాలు చేయ‌బోన‌ని స‌మాధానం ఇచ్చాడు. ఇదే నిజ‌మైతే గ‌న‌క ప‌వ‌ర్ స్టార్ అద్భుత‌మైన సినిమా కెరీర్ డిజాస్ట్ర‌స్ ముగింపు ఇదే అవుతుంది. ఎందుకంటే ఆయ‌న తొలి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి యావ‌రేజ్.. చివ‌రి చిత్రం అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్. అది కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోయే అతి పెద్ద డిజాస్ట‌ర్. ఇలాంటి సినిమాతో ప‌వ‌న్ కెరీర్ ముగియ‌డం నిజంగా అభిమానుల‌కు ఇష్టం లేదు. ఇంకా ఒక్క సినిమా చేసి కెరీర్ కు బైబై చెప్పాల‌ని కోరుకుంటున్నారు వాళ్లు. హిట్ సినిమా వ‌స్తే ఇక సినిమాలు చేయ‌మ‌ని అడ‌గం అంటున్నారు అభిమానులు. కానీ ప‌వ‌న్ మాత్రం ఇప్పుడు వినే మూడ్ లో లేడు. మొత్తానికి ఓ యావ‌రేజ్ సినిమాతో కెరీర్ మొద‌లుపెట్టి.. ఫ్లాప్ సినిమాతో ముగించాడు ప‌వ‌ర్ స్టార్.