బాలయ్య పైసా వసూల్ చివరకు కుర్చీల వసూల్

నటసింహం నందమూరి బాలకృష్ణ – స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పైసా వసూల్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుక రీసెంట్ గా ఖమ్మంలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అక్కడి అభిమానులకే కాక మిగిలిన జిల్లాల నుంచి కూడా భారీగా హాజరు కావడంతో.. వేలాదిమందితో పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ హోరెత్తిపోయింది. అయితే, ఈ వేడుక ప్రారంభం అయ్యే టైమ్ లోనే వరుణుడు కూడా వర్షం రూపంలో అక్కడ ప్రత్యక్షం అవ్వడంతో కార్యక్రమం కొంచెం ఇబ్బందిగానే నడిచింది. ఈ సందర్బంగా ఈవెంట్ కు విచ్చేసిన ఫ్యాన్స్ కూడా తాము కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలనే గొడుగులుగా మార్చుకుని కార్యక్రమం సక్సెస్ అయ్యేలా చూశారు.
ఇదంతా బాగానే ఉన్నా.. తీరా కార్యక్రమం ముగిసిపోయాక ఇంటిముఖం పట్టిన అభిమానులు లాస్ట్ లో కూడా అవే కుర్చీలను తలపై పెట్టుకుని వెళ్లిపోవడం ఇప్పుడు పెద్ద షాక్ ఇస్తోంది. ఇంతకూ మేటర్ ఏంటంటే, చిన్నపాటి వర్షంలో తడుస్తున్నా కూడా ఈలలు, గోలలతో కార్యక్రమానికి ఫుల్ కిక్ ఇచ్చిన ఫ్యాన్స్ చివర్లో అదే వర్షానికి అడ్డుగా పెట్టుకున్న కుర్చీలను అలానే పట్టుకుని వెళ్లిపోవడం మాత్రం విశేషమనే అనాలి. అందులోనూ అది ఓపెన్ గ్రౌండ్ కావడం, అలాగే వర్షం వస్తుండటంతో జనాలను నిలువరించే ప్రయత్నం నిర్వాహకులు చేయకపోవడంతో.. చివరకు 10 వేలకు పైగా కుర్చీలు మాయమయ్యాయని నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారట. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కడంతో.. జోకులు, సెటైర్లతో నెటిజన్లు రచ్చరచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది బాలయ్య పైసా వసూల్ కాస్తా చివరకు కుర్చీల వసూల్ అయిందని సరదాగా కామెంట్ చేస్తుండటం నవ్వులు పూయిస్తుంది.