పోల్ టెన్ష‌న్‌లో ఎన్టీఆర్‌?

Last Updated on by

బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం `ఎన్టీఆర్‌`. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత క‌థ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. `ఎన్టీఆర్‌- క‌థానాయ‌కుడు`, `ఎన్టీఆర్ -మ‌హానాయ‌కుడు` పేర్ల‌తో నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్రీరిలీజ్ వేడుక‌ను ఈ నెల 16న తిరుప‌తిలో భారీ స్థాయిలో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అనూహ్యంగా వీరికి తెలంగాణ ఎన్నిక‌ల టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. తిరుప‌తిలో ఫంక్ష‌న్ కోసం ప‌నుల‌ను కూడా మొద‌లుపెట్టినా.. ఆ రోజున ఈవెంట్‌ని నిర్వ‌హించ‌డానికి వెన‌కాడుతున్న‌ట్టు తెలిసింది. 11న ఎన్నిక‌ల ఫ‌లితాలు వున్నందున ప్రిరిలీజ్‌ వేడుక‌ను ప‌క్క‌న పెట్టి, అందుకు బ‌దులుగా 16న ట్రైల‌ర్‌ను మాత్ర‌మే రిలీజ్ చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌ను ర‌ద్దు చేయ‌డం లేదా వాయిదా వేసుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంద‌ని ఇన్‌సైడ్ టాక్‌. తెలంగాణ‌లో మ‌ళ్లీ త‌న పూర్వ‌వైభ‌వాన్ని సంత‌రించుకోవాల‌న్న ఎత్తుగ‌డ‌లో భాగంగా ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో క‌లిసి టీడీపీ పోటీకి దిగిన విష‌యం తెలిసిందే. నేడు (శుక్ర‌వారం) పోలింగ్ జ‌రుగుతోంది. దీని ఫ‌లితాలు 11న బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఆ రోజు 11గంట‌ల వ‌ర‌కు గెలుపు ఎవ‌రిదో.. ఓట‌మి ఎవ‌రికో తేలిపోతుంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ జ‌ట్టుక‌ట్టిన మ‌హాకూట‌మి విజ‌యం అనివార్య‌మైతే త‌రువాత జ‌రిగే ప‌రిణామాల‌ని క్యాష్ చేసుకుంటూ కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీయాల్సి వ‌స్తుంది. ఆ విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు బిజీ అవుతారు.

అలాంటి స‌మ‌యంలో 16న `ఎన్టీఆర్‌` ఫంక్ష‌న్ చేయ‌డం అంత ఈజీకాదు. ఆ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బాల‌య్య ప్రీరిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్టు వినిపిస్తోంది. ముందు అనుకున్న రోజున‌ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రిజ‌ల్ట్ ను బ‌ట్టి ఫంక్ష‌న్ ఏర్నాట్లు చేయాల‌ని ప్తాన్ చేస్తున్నార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టుగా కుదిరితే ఈ నెల 21కి ప్రీరిలీజ్‌ ముహూర్తం మార్చార‌ని తాజా స‌మాచారం. ఒక‌వేళ‌ తెరాస గ‌న‌క‌ విక్ట‌రీ సాధిస్తే నో ఫంక్ష‌న్‌…నో హ‌డావిడీ..అనీ తెలిసింది.

User Comments