సుకుమార్ రాజకీయాలు వ‌ద్దు ప్లీజ్‌!

Last Updated on by

ఏపీ రాజ‌కీయాలు అంత‌కంత‌కు వేడెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి మునుప‌టితో పోలిస్తే ప‌లువురు సినీతారలు రాజ‌కీయాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అలీ, 30 ఇయ‌ర్స్ పృథ్వీ, శివాజీ, నాగ‌బాబు, క‌విత‌, హేమ‌ వంటి స్టార్లు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్ర‌చారంలో భాగంగా ప‌లువురు స‌న్నిహిత స్టార్ల‌ను క‌లుస్తూ త‌మ పార్టీకి మ‌ద్ధ‌తు ప‌ల‌కాల్సిందిగా కోరుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఉదయం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. ప్రజలతో పాటు అందుబాటులో ఉన్న ప్రముఖులను సైతం కలుస్తూ తమ పార్టీకి మద్దతు తెలపాలని కోరుతున్నారు.

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ను తెదేపా, జనసేన అభ్యర్థులు కలిశారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో మట్టపర్రులో తెదేపా తరఫున పోటీచేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద రావు ఆయననను వేర్వేరుగా కలిసి త‌మ‌కు మ‌ద్ధ‌తు ప‌ల‌కాల‌ని, ఓట్లు వేయించాల‌ని కోరారు. అయితే సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్ట‌ర్ రాజ‌కీయాల జోలికి వెళ్ల‌డం ఇష్టం లేద‌ని అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో కోరుతున్నారు. సుకుమార్ సినిమాల‌తో మాత్రమే రంజింప‌జేయాల‌న్న‌ది ఫ్యాన్స్ కోరిక‌.

User Comments