హీరోల చుట్టూ రాజ‌కీయాలు

రాజ‌కీయాలు అంటూ చుట్టూ ఉన్న వాళ్లేదో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని కాదు.. ఇక్క‌డ అభిమానులే త‌న అభిమాన హీరోల్ని రాజ‌కీయాల్లోకి లాగేస్తున్నారు. బ‌య‌టికి రావాలంటేనే హీరోల‌కు ద‌డ పుట్టించేస్తున్నారు. తాజాగా జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ను చూసి ఫ్యాన్స్ అంతా సిఎం సిఎం అంటూ అరిచేసారు. అక్క‌డున్న వాళ్లు ఎంత కంట్రోల్ చేసినా.. ఎవ‌రూ అరుపులు ఆప‌లేదు స‌రిక‌దా ఇంకా పెంచారు. హ‌రికృష్ణ మైక్ ప‌ట్టుకున్న‌పుడు కూడా ఆప‌కుండా అరుస్తుంటే.. ఆ సిఎం కేక‌ల‌ను ఆప‌డానికి ఎన్టీఆర్ స‌ముదాయించాల్సి వ‌చ్చింది. నంద‌మూరి ఫ్యామిలీపై ఉన్న అభిమానమో లేదంటే జూనియ‌ర్ పై ప్ర‌త్యేకంగా ఫ్యాన్స్ పెట్టుకున్న న‌మ్మ‌కమో తెలియ‌దు కానీ సిఎం కావాలి అంటూ నిన‌దించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా ఈ మ‌ధ్య ఇది త‌ప్ప‌ట్లేదు. ప‌వ‌ర్ స్టార్ ఎక్క‌డ క‌నిపించినా.. సిఎం అంటూ అభిమానులు అరుస్తున్నారు. దానికి ప‌వ‌న్ కూడా చిరున‌వ్వుతోనే స‌మాధానం ఇస్తున్నారు.

త‌మిళ‌నాట అయితే ఈ ర‌చ్చ ఇంకో రేంజ్ లో ఉంది. అక్క‌డ హీరోలు అభిమానుల్ని కంట్రోల్ చేసే స్థాయి కూడా దాటిపోయింది. ఎందుకంటే త‌మిళ నాట ఉండేది అభిమానులు కాదు భ‌క్తులు. ఒక్కోసారి దేవుడు చెప్పినా వాళ్లు విన‌రు. అక్క‌డ కూడా రాజ‌కీయాల గోల ఎక్కువ‌గానే ఉంటుంది. ముఖ్యంగా విజ‌య్ ఎక్క‌డ క‌నిపించినా.. సిఎం అంటూ అరుస్తుంటారు అభిమానులు. దాన్ని విజ‌య్ కూడా ఆపే స్థాయిలో లేడిప్పుడు. ఆయ‌న ప్ర‌మేయం లేకుండానే కాబోయే ముఖ్యమంత్రి అంటూ గోల చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ర‌జినీకాంత్ కు కూడా పార్టీ పెట్టాలంటూ అడుగుతున్నారు అభిమానులు. ఇన్నాళ్లూ నెక్ట్స్ సినిమా ఏంటి అనే అడిగే అభిమానులు.. ఇలా హీరోలు ఎక్క‌డ క‌నిపించినా రాజ‌కీయాల్లోకి రావాలంటూ ర‌చ్చ చేస్తున్నారు. ఇదో కొత్త ట్రెండ్.. ఎంజాయ్ చేయండి హీరోలు..!