ప‌వ‌న్ కోసం పూజ… నిజ‌మేనంట‌!

రాజ‌కీయాల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఆయ‌నకి ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందో తెలియ‌దు. నిన్న‌నే బీజేపీతో జ‌ట్టుకట్టిన ఆయ‌న రాజ‌కీయంగా ఇంకా చాలా ప‌నులు చ‌క్క‌బెట్టాల్సి ఉంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మాత్రం ఆయ‌న సినిమాల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. `పింక్` రీమేక్‌కి రేపోమాపో కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే నిజ‌మైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇప్ప‌ట్లో కెమెరా ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. కొన్ని రోజులైనా ఆయ‌న విరామం తీసుకుని, సినిమాకోసం త‌న‌ని తాను సిద్ధం చేసుకోవ‌ల్సి ఉంటుంది.

ఇవ‌న్నీ తెలిసినా స‌రే… ద‌ర్శ‌కనిర్మాత‌లు ఏర్పాట్లు మాత్రం ప‌క్కా చేసేసుకుంటున్నారు. పింక్ రీమేక్‌తో పాటు, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒప్పుకున్న‌ట్టు స‌మాచారం. సోష‌ల్ ఎలిమెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఆ చిత్రం ఈ యేడాదే సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ట‌. ఆ సినిమా కోస‌మే పూజా హెగ్డేని క‌థానాయిక‌గా ఎంపిక చేసుకునే ప‌నిలో చిత్ర‌బృందం బిజీగా ఉంద‌ట‌. పూజా కూడా ఇటీవ‌ల తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆమె దాదాపుగా ఆ సినిమాకి ఓకే చెప్పిన‌ట్టే అని తెలిసింది. కానీ డేట్ల విష‌యంలోనే త‌న‌కి క్లారిటీ కావాల‌ని, దాన్నిబ‌ట్టి ప్లాన్ చేస్తాన‌ని ఆమె చెబుతోంద‌ట‌. మ‌రి ప‌వ‌న్ `పింక్‌` ఎప్పుడు పూర్తి చేస్తాడో, కొత్త సినిమాకోసం ఎప్పుడు డేట్లు స‌ర్దుబాటు చేస్తాడో, అప్పుడు పూజాకి ఖాళీ ఉంటుందో లేదో ఇలా చాలా లెక్క‌లే ఉన్నాయి. అన్నీ కుదిరితే మాత్రం ప‌వ‌న్ ప‌క్క‌న పూజ క‌నిపించ‌డం ఖాయ‌మైన‌ట్టే.