ప్ర‌భాస్ 20 గురించి పూజా

ఎలాగైనా స‌రే… వీలైనంత త్వ‌ర‌గా త‌న సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకున్నారు ప్ర‌భాస్‌. అందుకే ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ క‌ల‌వ‌రం కొన‌సాగుతున్నా ప్ర‌భాస్ మాత్రం ధైర్యంగా జార్జియా బ‌య‌ల్దేరి వెళ్లాడు. అయినా స‌రే… ఈ సినిమాని క‌రోనా బాగా డిస్ట‌ర్బ్ చేసేసింది. అక్క‌డ ఓ షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగొచ్చాడు ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం క్వారంటైన్ పీరియ‌డ్‌లో గ‌డుపుతున్నారాయ‌న‌. ఇండియాలోనూ క‌రోనా తీవ్ర‌త పెరుగుతుండ‌డంతో మ‌రికొన్నాళ్లు అంద‌రూ ఇంటికి ప‌రిమితం కాక త‌ప్ప‌డం లేదు. ప్ర‌భాస్ సినిమా గురించి అందులో క‌థానాయికగా న‌టిస్తున్న పూజాహెగ్డే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఒక ప్ర‌ముఖ పత్రిక‌తో ఆమె మాట్లాడుతూ ప్ర‌భాస్ 20 సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉంద‌ని చెప్పింది. ఇదొక ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. “పీరియాడిక‌ల్ సినిమానే అయినా… ఇందులో రొమాన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప‌రిణ‌తితో కూడిన ప్రేమ‌క‌థ ఇది. ఒక అంద‌మైన ప్రేమ‌క‌థగా ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేస్తుంద“ని ప్ర‌భాస్ 20 సినిమా గురించి చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. ఆమె ప్ర‌భాస్‌తోపాటే జార్జియా షెడ్యూల్‌కి వెళ్లొచ్చింది. ఆమె కూడా సెల్ఫ్ క్వారంటైన్ పీరియ‌డ్‌లోనే ఉంది.