ప‌వ‌న్‌ని స్కిప్ కొట్టి చానెల్ చీప్ ట్రిక్స్

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `సైరా నరసింహా రెడ్డి` ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో జ‌రిగిన‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వేదిక‌పై ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు.

ఈ వేదిక‌పై ప‌వ‌న్ మ‌రోసారి తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను గుర్తు చేసుకొని ఆవేదన వ్య‌క్తం చేశారు. మీలో ఒక‌డిగా వచ్చి మాట్లాడుతున్నా. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి తన అన్నయ్య. తనను అభిమానులు ఇంతగా ప్రేమిస్తున్నారంటే అందుకు కారణం అన్న‌య్యే… అని అన్నారు. ఉయ్యాల‌వాడది భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ చ‌రిత్ర అని అన్నారు.

ఇంత‌కుముందు మెగాస్టార్ బ‌ర్త్ డే వేడుక‌ల్లో గుర్తు చేసుకున్న‌ట్టే.. ఈసారీ ఇంటర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల్ని ప‌వ‌న్ గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు చనిపోయినప్పుడు తాను చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తనకూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తన అన్నయ్య ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ ధైర్యం, గుండె బలాన్ని ఏ రోజు వదిలి పెట్టలేదన్నారు. అన్నయ్యలా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబంలో ఉండి ఉంటే ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారు కాదేమో అనుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందరి బాగు కోరే వారు తన అన్నయ్య అన్నారు. దేశం గొప్ప‌త‌నం చెప్పే ఈ సినిమా గాంధీ జ‌యంతికి రిలీజ‌వుతుండ‌డం బావుంద‌ని స్ఫూర్తినిస్తుంద‌ని అన్నారు.

అయితే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కి సంబంధించి పాట‌ల్ని పెర్ఫామ్ చేసేప్పుడు ఈ ఈవెంట్ ని లైవ్ టెలీకాస్ట్ చేస్తున్న సాక్షి చానెల్ .. ఆ స‌మ‌యంలో వాటిని క‌ట్ చేసి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు టెలీకాస్ట్ చేసింది. జ‌న‌సేనాని ప‌వ‌న్ విష‌యంలో చానెల్ ప్ర‌తినిధులు త‌మ బుద్ధిని చూపించుకున్నార‌ని… చీప్ ట్రిక్స్ ప్లే చేశార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అంత పెద్ద ఈవెంట్ ని లైవ్ అప్ప‌గించినందుకు ప‌వ‌న్ పై ఈ సాధింపు ఏమిటి? అంటూ ఫ్యాన్స్ ముచ్చ‌టించుకున్నారు.