రియాలిటీ షో ల బట్టలు విప్పేసిన పోసాని

Posani Krishna Murali shocking comments Reality Shows

టాలీవుడ్ లో రైటర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా కంటే ఎక్కువగా తన క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్ తోనే పాపులారిటీ తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి గురించైనా, దేని గురించైనా ఏమాత్రం తడబడకుండా అందరి ముందు ఓపెన్ గా మాట్లాడటంలో పోసానిది అందెవేసిన నోరు అని ఇప్పటికే అందరికీ తెలుసు. ఇప్పుడు అదే నోటితో తెలుగు టీవీ ఛానల్స్ లో వచ్చే రియాలిటీ షో లలో దాదాపుగా అన్నీ నిజం కాదని చెప్పి వాటి బట్టలు విప్పేసినంత పని చేశారు. అంటే, ఆయా రియాలిటీ షో లు చాలావరకు నిజం కాదంటూ అందరి ముందు వాటి పరువు తీసినంత పని చేశారు.
ఇంతకూ మేటర్ ఏంటంటే, ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో పోసాని ఓ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో విడిపోయిన భార్యాభర్తలను కలిపే ప్రయత్నం చేయడం, కుటుంబ సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరపడం, మొత్తంగా వైవాహిక సమస్యలకు తగిన పరిష్కారాలు చూపించడం మనం చూస్తున్నాం. అయితే, ఈ కార్యక్రమంలో అన్నీ నిజం కాదని, కొన్ని నకిలీ కేసులు ఉంటాయని తాజాగా పోసాని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాకుండా భార్యాభర్తలను కొట్టుకోమని కార్యక్రమ నిర్వాహకులే సూచిస్తారని.. అన్నీ రోజులూ నిజమైన జంటలు రావు కాబట్టే నిర్వాహకులే నకిలీ జంటలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తారని పోసాని పేర్కొన్నారు.
అలాగే అన్ని కార్యక్రమాల్లో కంటే తన కార్యక్రమానికే బాగా పేరొచ్చిందని తెలిపిన పోసాని.. తాను మాత్రం అలాంటి నకిలీ జంటలతో కార్యక్రమాన్ని చేయనని నిర్మాతలకు చెప్పానని, తనకు నిజం అనిపిస్తేనే షో చేస్తానని పోసాని వ్యాఖ్యానించడం కొంచెం ఓవర్ గా అనిపిస్తోంది. ఇదే సమయంలో తాను ఒక్కరోజు షూటింగ్ కు రూ. 3.45 లక్షలు తీసుకుంటానని వెల్లడించిన పోసాని.. ఒక్కోసారి తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని కార్యక్రమానికి విచ్చేసిన నిజమైన జంటలను ఆదుకోవడానికి అందించినట్లు వివరించడం నిజమనిపిస్తోంది. చివరగా నిర్వాహకులు ముందుగానే ఒక్కొక్క షో లో ఒక్కొక్కరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని, దాని ప్రకారమే షో నడుస్తుందని పోసాని చెప్పడం చూస్తుంటే.. నిజంగానే ఇలాంటి షో లను బట్టలు విప్పి నిలబెట్టినట్లు అయింది. అయితే, తాను పాల్గొంటున్న కార్యక్రమం మాత్రం పర్ఫెక్ట్ అన్న రీతిలో పోసాని మాట్లాడటం మాత్రం ఇప్పుడు కొంతమంది విశ్లేషకులకు నచ్చడం లేదు.