బోయపాటికి పోసాని స్పెష‌ల్ ట్రీట్ మెంట్..

నంది అవార్డుల‌పై పోసాని ప్రెస్ మీట్ అన‌గానే అంద‌రికీ ఒక‌టే ఆస‌క్తి.. బోయ‌పాటి శీనుపై ఆయ‌న ఏం మాట్లాడ‌తాడు అని..? ఎందుకంటే ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌తంలోనే కొన్ని విభేదాలు ఉన్నాయి. అప్ప‌ట్లో బాహాటంగానే పేరు పెట్టి మ‌రీ బోయ‌పాటిని బండ బూతులు తిట్టాడు పోసాని. విశ్వాసం లేని వాడు అంటూ నోటికొచ్చిన‌ట్లు ఏకిపారేసాడు. దాంతో ఇప్పుడు నంది అవార్డుల ప్రెస్ మీట్ లో మ‌రోసారి బోయ‌పాటి గురించి ఏం మాట్లాడ‌తాడో అని అంతా ఆస‌క్తిగా చూసారు. ఎందుకంటే లెజెండ్ సినిమా బోయ‌పాటి చేసిందే.. దానికి ఏకంగా 9 అవార్డులు వ‌చ్చాయి.. పైగా బోయ‌పాటికి ఉత్తమ ద‌ర్శ‌కుడితో పాటు బిఎన్ రెడ్డి అవార్డు కూడా వ‌చ్చింది. ఇవి చాలు బోయ‌పాటిని పోసాని ఫుల్ గా ఏకి పారేయ‌డానికి అని కొంద‌రు విశ్లేషించారు. అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది. ఇక్క‌డ పేరు పెట్ట‌లేదు కానీ బోయ‌పాటితో పాటు చాలా మందికి స్పెష‌ల్ ట్రీట్ మెంట్ ఇచ్చాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. అర్హ‌త లేనివాళ్ల‌కు అవార్డులు వ‌చ్చాయంటూ ఆయ‌న మండి ప‌డ్డారు.

ముఖ్యంగా దర్శకత్వంలో అద్భుత‌మైన ప్రతిభ చూపించిన వాళ్ల‌కు ప్ర‌తీ ఏడాది బిఎన్ రెడ్డి అవార్డు ఇస్తారు. ఈ సారి ఆ అవార్డును బోయ‌పాటి శీనుకు ఇచ్చారు. మ‌రో రెండేళ్లు త్రివిక్ర‌మ్, రాజ‌మౌళికి ఇచ్చారు. ఈ అవార్డు అందుకోవాలంటే ఎంతో సామాజిక స్పృహ ఉన్న సినిమాలను తీయాలి. ప్ర‌తీ సినిమాలోనూ స‌మాజానికి సందేశం ఇవ్వాలి. కానీ అవేవీ ఇవ్వ‌ని బోయ‌పాటి శీనుకు 2016కు గాను ఈ అవార్డు ఇచ్చారు. పుష్క‌రాల‌కు బోయ‌పాటి సాయ‌ప‌డ్డాడ‌ని అవార్డు ఇచ్చి రుణం తీర్చుకున్నార‌ని తెలుగుదేశంపై.. జ్యూరీపై బాగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు పోసాని కూడా బిఎన్ రెడ్డి అవార్డు గ్ర‌హీత‌ల‌పై రెచ్చిపోయాడు. మ‌రీ ముఖ్యంగా ఈయ‌న సెటైర్లు అన్నీ బోయ‌పాటి వైపు వెళ్లాయి.

ప్ర‌తీ సినిమాలోనూ ర‌క్త‌పాతం త‌ప్ప మ‌రేది చూపించ‌ని బోయ‌పాటికి ఈ అవార్డు రావ‌డంపై కొంద‌రు బాహాటంగానే విమ‌ర్శించారు. ఎంద‌రో సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ఉండ‌గా బోయ‌పాటికి ఈ అవార్డు ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. సరిగ్గా ఇదే పాయింట్ పై బోయపాటి పేరు చెప్పకుండా ఫుట్ బాల్ ఆడేశాడు పోసాని. దర్శకుడు ముత్యాల సుబ్బయ్యను ఉదాహరణగా చూపిస్తూ.. సామాజిక స్పృహ సందేశం ఉన్న సినిమాలు సుబ్బ‌య్య ఎన్నోతీశారు.. కలికాలం లాంటి సినిమాను చూసి కె విశ్వనాథ్ మెచ్చుకున్నారు. సగటు మనిషి.. అమ్మాయి కాపురం.. అరుణ కిరణం.. అన్న.. పవిత్రబంధం.. పెళ్ళి చేసుకుందాం.. స్నేహితులు.. వంటి గొప్ప సినిమాలను ముత్యాల సుబ్బయ్య తీస్తే.. ఆయ‌న‌కు బిఎన్ రెడ్డి అవార్డు ఇవ్వ‌డానికి మ‌నోళ్ల‌కు చేతులు రాలేదు. ఇప్పుడు అవార్డు తీసుకున్న ద‌ర్శ‌కుల‌ను ముత్యాల సుబ్బ‌య్య తీసిన సినిమాల‌తో పోల్చి చూడండి.. అప్పుడు మీకే అర్థ‌మ‌వుతుందంటూ మండి ప‌డ్డాడు పోసాని. మొత్తానికి ఈయ‌న మాట‌లు ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తాన్ని ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది.