సాహో.. మ‌ళ్లీ ఇక్క‌డికే వ‌చ్చేసిందే..!

బాహుబ‌లి తెలుగు ఇండ‌స్ట్రీకి మంచి చేసిందో.. చెడు చేసిందో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. మార్కెట్ పెరిగింద‌ని సంతోష‌ప‌డాలో.. దాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా భారీ బ‌డ్జెట్ పెట్టి చేతులు కాల్చుకుంటున్నార‌ని బాధ ప‌డాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు సాహోకు కూడా ఆకాశ‌మంత బ‌డ్జెట్ పెట్టేస్తున్నారు. ఈ చిత్రానికి 200 కోట్ల బ‌డ్జెట్ కేటాయిస్తే.. అందులో కేవ‌లం దుబాయ్ షెడ్యూల్ కోస‌మే 90 కోట్లు ఖర్చు చేసారు. రుమేనియన్ షెడ్యూల్ కూడా ఇంతే భారీగా చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సుజీత్. గ‌త రెండు నెల‌లుగా సాహో టీం ఇండియాలో లేదు. ఇప్పుడు అన్నీ పూర్తి చేసుకుని ఇండియాకు వ‌స్తున్నారు ఈ టీం.

మొన్న‌టి వ‌ర‌కు రోజుకు 250 మంది క్ర్యూతో పాటు హై టెక్నిక‌ల్ టీం ఈ సినిమా కోసం ప‌ని చేసారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్ర‌ఫ‌ర్ కెన్నీబేట్స్ సాహో కోసం యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు. దుబాయ్ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో ఇప్పుడు ఆర్ఎఫ్సీలో కూడా భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఇక్క‌డ ముందు రెండు వారాలు షెడ్యూల్ అనుకున్నా కూడా ఇప్పుడు ఏకంగా 47 రోజులకు ఈ షెడ్యూల్ మార్చేసాడు ద‌ర్శ‌కుడు. దుబాయ్ షెడ్యూల్ కోసం ఇంత‌గా ఖ‌ర్చు చేయ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అక్క‌డ షూటింగ్ చేస్తే.. దుబాయ్ టూరిజం రూల్స్ ప్ర‌కారం 30 శాతం వెన‌క్కి ఇస్తారు. అంటే 90 కోట్ల‌లో 65 కోట్లు పెడితే చాలు.. మిగిలిన అమౌంట్ రాయితీ అన్న‌మాట‌. మొత్తానికి ఇండియాలోనే బెస్ట్ యాక్ష‌న్ సినిమాగా సాహోను తీర్చిదిద్దే ప‌నిలో బిజీగా ఉన్నాడు సుజీత్.