ప్ర‌భాస్ రంగంలోకి దిగాడు

ఎట్ట‌కేల‌కి ప్ర‌భాస్ రంగంలోకి దిగాడు. `జాన్` కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఈ రోజు నుంచే షురూ అయ్యింది. అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో ప్ర‌భాస్‌, ఇత‌ర చిత్ర‌బృందంపై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ అప్‌డేట్ కోసమే చాలా రోజులుగా ప్ర‌భాస్ అభిమానులు ఎదురు చూస్తూ వ‌చ్చారు. `సాహో` త‌ర్వాత పూర్తిస్థాయిలో షెడ్యూల్ కోసం ప్ర‌భాస్ కెమెరా ముందుకు వెళ్లింది ఇప్పుడే. సాహో ఫ‌లితాన్నిదృష్టిలో పెట్టుకుని క‌థ‌లోకొన్ని కీల‌క మార్పుచేర్పులు చేసిన‌ట్టు స‌మాచారం. కాస్త ఆల‌స్య‌మైనా… అంతా ప‌క్కాగా ప్లాన్ చేసుకునే రంగంలోకి దిగాల‌న్న ప్ర‌భాస్ నిర్ణ‌యం మేర‌కే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ట‌.

మొత్తంగా చాలా రోజుల త‌ర్వాత డార్లింగ్ రంగంలోకి దిగాడ‌న్న‌మాట‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌లో వేసిన సెట్లు ప్యారిస్ న‌గ‌రాన్ని పోలి ఉంటాయ‌ట‌. అక్క‌డ ఇప్ప‌టికే కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ అర‌చేతినిచూసి జాత‌కాలు చెప్పే యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప్రేమ‌క‌థ ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంద‌ని తెలిసింది. మ‌రి కాసేపట్లో వీడియోతో కూడిన గ్లింప్స్‌ని కూడా విడుద‌ల చేయ‌బోతోంది చిత్ర‌బృందం.