రివ్యూ: ప‌్రెషర్ కుక్క‌ర్‌

Last updated on February 27th, 2020 at 03:07 pm

తారాగణం: సాయి రోనాక్, ప్రీతి అస్రానీ, రాహుల్ రామకృష్ణ, రాజై రోవాన్, తనకెళ్ల భరణి, సివిఎల్ నరసింహారావు

సినిమాటోగ్రఫీ: నాగేష్ బానెల్ & అనిత్ మాడాడి

బ్యానర్లు: కరంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్

సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగుంజ్, స్మారన్, హర్షవర్ధన్ రామేశ్వర్

బిజిఎం: హర్షవర్ధన్ రామేశ్వర్

ఎడిటర్: నరేష్ రెడ్డి జోన్నా

రచన & దర్శకత్వం: సుజోయి & సుశీల్

నిర్మాతలు: సుజోయి & సుశీల్, అప్పీ రెడ్డి

ముందుమాట‌:
చిన్న చిత్రాలైనా కొన్ని విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో `ప్రెష‌ర్ కుక్క‌ర్` ఒక‌టి. ఇందులో కాన్సెప్ట్‌, ప్ర‌చార చిత్రాలు ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా అనిపించాయి. చాలామందికి క‌నెక్ట్ అయ్యే అంశం ఉంద‌నిపించింది. దానికితోడు అభిషేక్ పిక్చర్స్ సంస్థ విడుద‌ల హక్కులను సంపాదించుకోవ‌డం కూడా సినిమాపై అంద‌రి దృష్టి ప‌డేలా చేసింది. మ‌రి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప‌్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుంది? తెలుసుకుందాం ప‌దండి…

క‌థ‌:
కిషోర్ (సాయి రోనాక్) ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. తన తండ్రి కలను నెరవేర్చడానికి అమెరికా వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. వీసా పొందడానికి పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. కిషోర్ తన తండ్రి మరియు తన ఊరి జ‌నం ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి హైదరాబాద్ వెళ్తాడు. మ‌రి అక్క‌డికి వెళ్లిన కిషోర్ ఏం చేశాడు? ఇంత‌కీ అమెరికా వెళ్ళగలిగాడా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ
ఇది మంచి క‌థే. త‌మ పిల్ల‌లు అమెరికా వెళ్లాల‌ని, ఆ విష‌యాన్ని ప‌దిమందితో గొప్ప‌గా చెప్పుకోవాల‌ని ప్ర‌తి త‌ల్లిదండ్రీ క‌ల‌లు కంటుంటారు. కానీ ఆ ప్ర‌య‌త్నంలో యువ‌త ప‌డే పాట్లు, వెళ్లాక అక్క‌డ ఉండేందుకు ప‌డే పాట్లు బోలెడ‌న్ని ఉంటాయి. ఆ ప్ర‌హ‌స‌నాన్ని వ్యంగంగా, అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాల‌తోనూ చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. నిజానికి ఇది మంచి కాన్సెప్టే. కానీ ద‌ర్శ‌కుల అనుభ‌వ‌లేమివ‌ల్ల మంచి క‌థ వృథా అయిపోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. కామెడీ కోసం ద‌ర్శ‌కులు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దాంతో ప్ర‌థ‌మార్థం బోరింగ్‌గా సాగుతుంది. ఇక ద్వితీయార్థంలోనైనా క‌థ‌పై ప‌ట్టు దొరికిందా అంటే అక్క‌డ కూడా నిరాశే. కొన్ని భావోద్వేగ స‌న్నివేశాలు మిన‌హా కొత్త‌గా చెప్పిందేమీ లేదు. ప్ర‌తి ఇంటా ఇదే లొల్లి అని క్యాప్ష‌న్‌కి త‌గ్గ‌ట్టుగా మాత్రం ప్ర‌తి ఇంట్లోనూ క‌నిపించే అమెరికా లొల్లి గురించి డాక్యుమెంటేష‌న్ చేసినట్టైతే అనిపిస్తుంది. పాత్ర‌ల్ని తీర్చిదిద్దుకున్న విధానం మాత్రం మెప్పిస్తుంది. ప్ర‌తి పాత్ర‌కీ కొన్ని స్వ‌తంత్ర భావాలు క‌నిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు ఏమాత్రం మెప్పించ‌వు.

 నటీన‌టులు.. సాంకేతిక‌త‌
క‌థానాయ‌కుడు సాయి రోనాక్ మంచి మంచి న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. ఒత్తిడితో స‌త‌మ‌త‌మ‌య్యే స‌గ‌టు కుర్రాడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. ప్రీతి అస్రానీ తెలుగు అమ్మాయి. అందంగా కనబడుతుంది. రాహుల్ రామకృష్ణ తనకు ఏది ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ప్ర‌థ‌మార్థంలో చాలా బాగా న‌టించిన ఆయ‌న‌, రెండవ భాగంలో మాత్రం తక్కువగా క‌నిపిస్తాడు. తనికెళ్ల‌ భరణి ఎమోషన్స్‌తో నిండిన పాత్రలో చాలా బాగా న‌టించాడు. స్నేహితుడి పాత్రలో రాజై రోవన్, మిగిలిన పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. సుజోయ్‌, సుశీల్ దర్శకద్వయం ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని ప్ర‌తిబింబించేలా ఒక మంచి అంశాన్ని ఎన్నుకుంది. అయితే వాళ్ల అనుభ‌వ లేమి రచనలోనూ, ద‌ర్శ‌క‌త్వంలోనూ స్ప‌ష్టంగా క‌నిపించింది. మంచి డ్రామా, మంచి హాస్యం పండేలా చిత్రాన్ని తీర్చిదిద్ద‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. ప్రారంభం నుండి చివరి వరకు పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది సినిమా. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగుంజ్, స్మారన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. నేప‌థ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. తెలంగాణ సాహిత్యాన్ని విస్తృతంగా ఉపయోగించారు. నాగేష్ బానెల్ & అనిత్ మాదాడి కెమెరా పని బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ప‌రంగా చూస్తే ఇదొక చిన్నచిత్రమే అయినా చాలా నాణ్యంగా ఉంటాయి.

రేటింగ్: 2/5

చివ‌రిగా: ఈ ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో వంట‌కం స‌రిగ్గా కుద‌ర‌లేదు.