US రిలీజెస్ అంటూ PRO ముంచేశాడు

రంగుల ప్ర‌పంచంలో ఆర్జ‌న ఒక్క‌టే ముఖ్యం. దానికోసం ఏ గ‌డ్డి క‌ర‌వ‌డానికైనా కొంద‌రుంటారు. అయితే ఇలాంటి వాళ్ల వ‌ల్ల వేలాది మందికి ఉపాధినిచ్చే నిర్మాతలు స‌ర్వ‌నాశ‌నం అయిపోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు అయిన దానికి కాని దానికి దోచి పెట్టాల్సిన దారుణ ప‌రిస్థితి ఇండ‌స్ట్రీలో ఉంద‌న్న విమ‌ర్శ‌లు పోటెత్తుతున్నాయి.

అయితే ఇప్పుడు అమెరికా(USA) బిజినెస్ పేరుతో ఓ పీఆర్వో చిన్న నిర్మాత‌ల్ని మభ్య పెడుతూ ల‌క్ష‌ల్లో వ‌సూల్ చేస్తుండ‌డంపై అమెరికా డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. స‌ద‌రు పీఆర్వో లీల‌ల్ని USA పంపిణీ దారులు క‌నిపెట్టేయ‌డ‌మే గాక దీనిపై సీరియస్ గా చ‌ర్చిస్తుండ‌డం వేడెక్కిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన నిర్మాత‌లు.. చిన్న నిర్మాత‌ల‌కే ఈ పీఆర్వో కుచ్చు టోపీ పెడుతున్నాడ‌ట‌.

చిన్న నిర్మాత‌ల‌కు అమెరికాలో స‌రైన కాంటాక్ట్స్ లేక‌పోవ‌డం స‌ద‌రు పీఆర్వోకు ఆయాచిత వ‌రంగా మారుతోంది. అమెరికా రిలీజ్ కి సాయం చేస్తామంటూ ల‌క్ష‌ల్లో గుంజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు స‌హా ఇండియా లెవ‌ల్లో మ్యానేజ్ చేసినా అమెరికా వ్యాపారంలో చిన్న నిర్మాత‌లు వెన‌క‌బ‌డ‌డంతో ఈ ప‌రిస్థితి క‌లుగుతోంద‌ట‌. ఇటీవ‌లే రిలీజైన చిన్న సినిమాలు 90ఎంఎల్, మిస్ మ్యాచ్, భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు చిత్రాల్ని స‌ద‌రు పీఆర్వోనే మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెరిపార‌ట‌. అమెరికా బిజినెస్ పేరుతో నిర్మాత‌ల్ని ఆడుకున్నాడ‌న్న చ‌ర్చా సాగింది. తీరా అమెరికా డీల్ పూర్త‌యినా అక్క‌డ అంత‌గా ప్రాముఖ్య‌త లేని ఊరూ పేరు లేని థియేట‌ర్ల‌లో ఆ సినిమాల్ని ఆడించి మ‌మ అనిపించేస్తుండ‌డంతో నిర్మాత‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంది. అమెరికాలో ప‌రిచ‌యాలు ఉన్నంత మాత్రాన మ‌భ్య పెట్ట‌డం మాయ మాట‌లు చెప్ప‌డం స‌బ‌బేనా? అంటూ చ‌ర్చ సాగుతోంది.