న్యూస్‌ చానెళ్ల‌కు చీవాట్లు పెట్టిన నిర్మాత‌

మీడియా చానెళ్ల‌కు నిర్మాత‌ల‌కు మ‌ధ్య స్నేహం నీటి బుడ‌గ లాంటిది. అది ఎప్ప‌టివ‌ర‌కూ అలా తేలి ఉంటుందో ఎప్పుడు పేల్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. స్నేహం అక్క‌ర్లేద‌నుకుంటే ధ‌డేల్‌మంటుంది. స‌రిగ్గా ఇదే వ్య‌వ‌హారం ఓ సీనియ‌ర్ నిర్మాత‌లో అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. ఓ రెండు అగ్ర చానెళ్ల క‌క్ష‌పూరిత ధోర‌ణి.. క‌మ‌ర్షియ‌ల్ యాటిట్యూడ్ ని నిల‌దీసే వ‌ర‌కూ వెళ్లింది ప‌రిస్థితి. స‌ద‌రు చానెళ్ల‌ తీరుతెన్నుల‌పై ఆయ‌న ఓ రేంజులో విరుచుకుప‌డ్డారు. ఇంత‌కీ ఎవ‌రా నిర్మాత‌? అంటే మెగానిర్మాత కె.ఎస్.రామారావు. ఈ శుక్ర‌వారం అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజైన `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` సినిమా ప్ర‌మోష‌న్ ని కావాల‌నే స‌ద‌రు చానెళ్లు దూరం పెట్టాయ‌న్న‌ది ఆయ‌న‌ ఆవేద‌న‌. హైద‌రాబాద్ జేఆర్సీ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన ప్రీరిలీజ్ వేడుకను ఓ రెండు టీవీ చానెళ్లు లైట్ తీస్కోవ‌డం ఆయ‌న‌లో కోపానికి కార‌ణ‌మైంది. స‌ద‌రు చానెళ్లు కావాల‌నే క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని ఆరోపించ‌డ‌మే గాక‌ మీడియాలో ఈ వైఖ‌రి మారాల‌ని తీవ్ర స్వ‌రంతో ఆయ‌న సూచించారు.

చిన్న సినిమాల‌కు మీడియా స‌పోర్ట్ అవ‌స‌రం. ఇక్క‌డ బ‌యాస్ ఉండ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. నేను తీసిన‌ది సినిమానే కాదా? అస‌లు నేను నిర్మాత‌నే కాదా? అంటూ సక్సెస్ ఈవెంట్ ని క‌వ‌ర్ చేస్తున్న అన్ని మీడియా చానెళ్ల స‌మ‌క్షంలోనే ఆయ‌న ఓ రేంజులో విరుచుకుప‌డ‌డంతో దీనిపై ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిగా ముచ్చ‌టించుకున్నారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తీసిన నిర్మాత‌కే ఇన్ని తిప్ప‌లు ఉంటే ఇక చోటా మోటా నిర్మాత‌ల్ని స‌ద‌రు టీవీ చానెళ్లు ఎన్ని తిప్ప‌లు పెడుతున్నాయో? అంటూ విస్త్ర‌తంగా చ‌ర్చ సాగింది. పైగా కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి ఈవెంట్ కి విజ‌య్ దేవ‌ర‌కొండ, రాశీ ఖ‌న్నా లాంటి ప్ర‌ముఖ స్టార్లు వ‌చ్చారు. అయినా లైవ్ ఈవెంట్ క‌వ‌ర్ చేసేందుకు స‌ద‌రు చానెళ్లు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డాన్ని నిర్మాత కె.ఎస్.రామారావు త‌ప్పుప‌ట్టారు. కావాల్సిన‌న్ని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాం క‌దా? అయినా ఇలా చేయ‌డం బాలేద‌ని ఆవేద‌నను వ్య‌క్తం చేశారు. మీడియా సంస్థ‌లు, యాజ‌మాన్యాలు అన్ని సంద‌ర్భాల్లోనూ కేవ‌లం బిజినెస్ యాంగిల్ మాత్ర‌మే చూడ‌కూడ‌ద‌ని చిన్న సినిమాకి అండ‌గా నిల‌వాల‌ని సూచించారు. తెలుగు సినిమా హిస్ట‌రీలో ఆ రెండు అగ్ర చానెళ్ల‌పై ఇన్నేళ్ల‌లో ఏ నిర్మాతా ఈ రేంజులో విరుచుకుప‌డ‌డం చూడ‌లేదు. అందుకే ఇప్పుడు ఈ టాపిక్ టీ-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. త‌మిళ చిత్రం `క‌ణ` రీమేక్ గా తెర‌కెక్కిన‌ `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే గాక థియేట‌ర్ల‌లోనూ చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చిత్ర క‌థానాయిక ఐశ్వ‌ర్య‌రాజేష్ న‌ట‌న‌త పాటు.. న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్, శివ‌కార్తికేయ‌న్ ల న‌ట‌న‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` చిత్రం ఓపెనింగ్ డే 60శాతం ఫుల్స్ తో ర‌న్ అయ్యింద‌ని.. పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ థియేట‌ర్ల ఆక్యుపెన్సీ పెరుగుతోంద‌ని ట్రేడ్ వెల్ల‌డించింది.