తనయుడి మెహ‌బాబూ కోసం కష్టపడుతున్నాడు

Last Updated on by

అయిపోయింది.. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా అయిపోయింది. ఎప్పుడు మొద‌లుపెట్టాడో.. ఎప్పుడు పూర్తి చేసాడో తెలియ‌నంత వేగంగా త‌న కొడుకు సినిమాను పూర్తి చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. మెహ‌బూబా షూటింగ్ పూర్తై కూడా వారం రోజులు అయిపోయింది. ఇప్పుడు గుమ్మ‌డికాయ్ ఫంక్ష‌న్ కూడా చేసేసారు. అన్ని ఫార్మాలాటిస్ పూర్తిచేసి.. విడుద‌ల‌కు సిద్ధం చేసాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. మెహ‌బూబా పూరీ జ‌గ‌న్నాథ్ కెరీర్ తో పాటు త‌న‌యుడి కెరీర్ కు కూడా కీల‌కం. ఆకాష్ ఇప్ప‌టికే ఆంధ్రాపోరీ సినిమాతో ప‌రిచ‌యం అయ్యాడు. కానీ అది లాంఛింగ్ లా భావించ‌డం లేదు పూరీ. త‌న కొడుకునే త‌నే హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. త‌న కెరీర్ ఎలాగైనా గాడిన ప‌డుతుంది ఒక్క హిట్ కొడితే కానీ త‌న‌యుడి కెరీర్ అలా కాదు క‌దా.. ఆకాష్ నిల‌బ‌డాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు.

ఇక్క‌డ హీరోల కొడుకుల‌కు ఉన్నంత పుష్ అప్ ద‌ర్శ‌కుల త‌న‌యుల‌కు ఉండ‌దు. అల్ల‌రి న‌రేష్ ని ఇవివి ఎంతో ట్రై చేస్తే కానీ నిల‌బ‌డ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌డ్డాడు. ఇక ఆర్య‌న్ రాజేష్ ప‌రిస్థితి చెప్పాల్సిన ప‌నిలేదు. సాక్షాత్తు రాఘ‌వేంద్ర‌రావ్, దాస‌రి త‌న‌యుల‌కే దిక్కులేదు ఇక్క‌డ‌. అందుకే డైరెక్ట‌ర్ కొడుకులు అంటే ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా గుర్తింపు ఉండ‌దు. అందుకే త‌న‌యుడి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మెహ‌బూబా ఖచ్చితంగా హిట్ కావాల్సిందే అనే క‌సితో ఉన్నాడు. కెరీర్ కొత్త‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం.. ఇడియ‌ట్.. శివ‌మ‌ణి.. అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి లాంటి సినిమాల్లో పూరీ ప్రేమ‌క‌థ‌లు అదిరిపోయాయి. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు 1971 ఇండోపాక్ వార్ నేప‌థ్యంలో న‌డిచే ఓ ప్రేమ‌క‌థ‌ను తీసుకొస్తున్నాడు పూరీ.

టీజ‌ర్లో ఆకాష్ ను పెద్ద‌గా చూపించ‌లేదు పూరీ. అంతా లొకేష‌న్స్ పైనే దృష్టి పెట్టాడు. ఇందులో హీరోయిన్ గా నేహాశెట్టి న‌టిస్తోంది. ఆమె పాక్ అమ్మాయిగా న‌టిస్తుంది. ఇండియ‌న్ అబ్బాయి.. పాక్ అమ్మాయి మ‌ధ్య ప్రేమ‌క‌థ అనేదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ రెండింటి మ‌ధ్య‌లో పూరీ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..? ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ కూడా మొద‌లుపెట్టాడు పూరీ. స‌మ్మ‌ర్ లో విడుద‌లకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. మ‌రి ఇత‌ర వార‌సుల‌కు మంచి లాంఛింగ్ ఇచ్చిన పూరీ.. ఇప్పుడు ఎంతో కసితో తన వార‌సుడికి అంత కంటే గొప్ప హిట్ ఇవ్వాలని మెహ‌బూబా తీశాడు.

User Comments