చిరు కోస‌మేనా ఆ క‌థ‌

Puri penned New Story For Megastar

ఇటీవ‌ల కాలంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని కాంబోలో సినిమా సెట్ట‌వ్వ‌బోతోందా? క‌రోనాతో వ‌చ్చిన ఈ గ్యాప్‌లో అగ్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌యారు చేస్తున్న క‌థ చిరంజీవి కోస‌మేనా? పూరి కాంపౌండ్‌కి స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తులు అది నిజ‌మే అంటున్నాయి. పూరి ఇదివ‌ర‌కే చిరు కోసం ఓ క‌థ సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. `ఆటోజానీ` అనే పేరుని కూడా ఖ‌రారు చేశారు. కానీ ఆ క‌థ‌లో కొంత భాగం చిరుకి న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ సినిమా ఆగిపోయింది. అయినా చిరు అడిగుంటే మ‌ళ్లీ మార్చేవాడిన‌ని కూడా పూరి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు చిరంజీవి కోసం మ‌రో కొత్త క‌థ‌ని సిద్ధం చేస్తున్నార‌ట పూరి జ‌గ‌న్నాథ్‌. `ఫైట‌ర్` త‌ర్వాత చిరుతోనే సినిమా చేయాల‌నేది పూరి ప్లాన్‌. బౌండెడ్ స్క్రిప్టుతోనే చిరంజీవి ద‌గ్గ‌రికి వెళ్ల‌బోతున్నాడ‌ట పూరి. నిజానికి త‌దుప‌రి ఆయ‌న తీయ‌బోయే సినిమా ప‌వ‌న్‌తో అని ప్ర‌చారం సాగింది. కానీ పవ‌న్ సినిమాలు పూర్త‌య్యేస‌రికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. అందుకే రాజ‌కీయం నేప‌థ్యంలో చిరు శైలికి త‌గ్గ‌ట్టుగా పూరి ఓ క‌థ‌ని సిద్ధం చేస్తున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం. `ఫైట‌ర్‌` సినిమాని ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్తి చేశాడు పూరి. లాక్‌డౌన్ త‌ర్వాత మెరుపు వేగంతో ఆ సినిమాని పూర్తి చేసి, ఆ వెంట‌నే చిరుతో చిత్రం కోసం బిజీ అవ్వ‌బోతున్నార‌ని తెలిసింది.