రాజా ది గ్రేట్ రివ్యూ

రివ్యూ:            రాజా ది గ్రేట్
న‌టీన‌టులు:   ర‌వితేజ‌, మెహ్రీన్, శ్రీ‌నివాస్ రెడ్డి, రాధిక‌, ప్ర‌కాశ్ రాజ్..
నిర్మాత‌:         దిల్ రాజు
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌కుడు: అనిల్ రావిపూడి

రెండేళ్లైంది ర‌వితేజ సినిమాలు రాక‌. ఇన్నాళ్ల‌కు రాజా ది గ్రేట్ అంటూ వ‌చ్చేసాడు మాస్ రాజా. అది కూడా వ‌ర‌స‌గా రెండు విజ‌యాలతో జోరు మీదున్న అనిల్ రావిపూడిని వెంట తీసుకుని వ‌చ్చాడు. మ‌రి ఈ ఫ్రెష్ కాంబినేష‌న్ ఎలా ఉంది..? అంచ‌నాలు అందుకుందా..? దిల్ రాజు ఈ ఏడాది మ‌రో హిట్ అందుకున్నాడా..?

క‌థ‌:
ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్(ప్ర‌కాశ్ రాజ్) త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఆ క్ర‌మంలోనే విల‌న్ దేవ‌రాజ్ త‌మ్ముడిని ఎన్ కౌంట‌ర్ చేస్తాడు. దానికి ప్ర‌కాశ్ రాజ్ కూతురు ల‌క్కీ(మెహ్రీన్) సాయం చేస్తుంది. దాంతో దేవా పోలీస్ ఆఫీస‌ర్ తో పాటు త‌మ్మున్ని చంపిన అందర్నీ చంపేస్తాడు. ల‌క్కీ మాత్ర‌మే మిగిలిపోతుంది. ఆమెను కాపాడే బాధ్య‌త‌ను పోలీస్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది. అక్క‌డే అనంత‌ల‌క్ష్మి(రాధిక‌) కూడా ఉంటుంది. ఆమె కొడుకు రాజా(ర‌వితేజ‌). ల‌క్కీని కాపాడే సీక్రేట్ మిష‌న్ లో అంధుడైన రాజాను కూడా అప్పాయింట్ చేస్తారు. ఆ త‌ర్వాత ఆమెను రాజా ఎలా కాపాడాడు..? అంధుడు అయినా కూడా విల‌న్ బారి నుంచి ఎలా ర‌క్షించాడు అనేది మిగిలిన క‌థ‌.

క‌థ‌నం:
రాజా ది గ్రేట్ చాలా సింపుల్ కథ‌. తెలిసిన క‌థ‌నే తెలివిగా కామెడీ స‌న్నివేశాల‌తో రాసుకున్నాడు అనిల్ రావిపూడి. సినిమా మొద‌లైన పావుగంట‌కే క‌థ మొత్తం చెప్పేసాడు ద‌ర్శ‌కుడు. ప్రేక్ష‌కుల‌కు కూడా కావాల్సినంత క్లారిటీ ఇచ్చేసాడు. అంధుడైన హీరోను ఇప్పుడు హీరోయిన్ ను కాపాడ‌తాడు.. ఇంకెవ‌రు ఆప్ష‌న్ లేదు.. సో.. హీరో ఏం చేసినా మీరు చూడాల్సిందే అని హింట్ ఇచ్చేసాడు. త‌ర్వాత హీరో బ్లైండ్ నెస్ కు త‌గ్గ‌ట్లు క‌థ రాసుకున్నాడు. బ్లైండ్ అయినా కూడా ఎక్క‌డా ఆ ఛాయ‌లే లేకుండా చిన్న‌ప్ప‌ట్నుంచే కొడుకుని అలా పెంచింది అన్న‌ట్లు ఫ్లాష్ బ్యాక్ లో చూపించి ప్రేక్ష‌కులను సాటిస్ ఫై చేసాడు. తెలిసిన క‌థ‌కే బ్లైండ్ ట‌చ్ ఇచ్చి.. స్క్రీన్ ను క‌ల‌ర్ ఫుల్ చేసాడు. ఇక విల‌న్, అత‌డి తండ్రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ ధృవ సినిమాలో పోసాని, అర‌వింద్ స్వామిని పోలి ఉంటాయి.
ఏం జ‌రుగుతుందో తెలుసు.. కానీ ఎలా జ‌రుగుతుందో తెలియ‌దు. హీరోయిన్ కోసం హీరో ఫైట్ చేస్తాడ‌ని తెలుసు.. కానీ అంధుడైన హీరో ఎలా కాపాడుతాడ‌నేది ఆస‌క్తిక‌రంగా చూపించాడు అనిల్. క‌ష్టాల్లో ఉన్న హీరోయిన్ ను కాపాడాలి అనే పాత క‌థ‌నే తీసుకుని.. దానికే తెలివైన స్క్రీన్ ప్లే.. కామెడీ స‌న్నివేశాలు రాసుకున్నాడు అనిల్. పైగా బ్లైండ్ కారెక్ట‌ర్ అంతగా ఎలా ఫైట్ చేస్తాడు అనేదానికి వెల్ ట్రైన్డ్ అనేది కూడా చూపించాడు అనిల్. అయితే ఎంత ట్రైన్డ్ అయినా.. హీరో ఏం చేసినా చెల్లుతుంది అనే సినిమాటిక్ లిబ‌ర్టీ కూడా తీసుకున్నాడు అనిల్. ఫ‌స్టాఫ్ అంతా హిలేరియ‌స్ గా సాగిపోతుంది. కానీ సెకండాఫ్ మాత్రం క‌థ లేక సాగిపోతుంది. గున్న‌మామిడి సాంగ్ టీజ‌ర్.. హీరోయిన్ ఇంటికి విల‌న్ వ‌చ్చిన‌పుడు హీరో ఇచ్చే వార్నింగ్ ఎపిసోడ్ ఇవ‌న్నీ సెకండాఫ్ ను నిల‌బెట్టాయి. క్లైమాక్స్ ఊహించిన‌ట్లే ఉంది. రాజా రొటీన్ గానే ఉన్నా.. ఎక్క‌డ బోర్ మాత్రం కొట్టించ‌డు.

న‌టీన‌టులు:
రాజా ది గ్రేట్ గురించి చెప్పాలంటే ర‌వితేజ గురించి మాత్ర‌మే చెప్పాలి. ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ ముందు రొటీన్ స్టోరీ అనేది క‌నిపించ‌లేదు. ఆయ‌న కెరీర్ లోనే ది బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు మాస్ రాజా. అంధుడిగా ఆయ‌న ఇచ్చిన ప్ర‌తీ ఎక్స్ ప్రెష‌న్ న‌టుడిగా ఆయ‌న స్థాయి చూపించింది. మెహ్రీన్ త‌న‌కు ఉన్నంత వ‌ర‌కు బాగానే చేసింది. శ్రీ‌నివాస్ రెడ్డి హీరో ప‌క్క‌నే ఉంటూ సినిమా అంతా బాగా న‌వ్వించాడు. ప్ర‌కాశ్ రాజ్, సంప‌త్ కుమార్, రాధిక, రాజేంద్ర‌ప్ర‌సాద్ స్క్రీన్ ప్ర‌జెన్స్ త‌క్కువే అయినా బాగా చేసారు. ఇక విల‌న్ తండ్రిగా త‌ణికెళ్ల భ‌ర‌ణి ఓకే. విల‌న్ గా కొత్త కుర్రాడు బాగానే చేసాడు. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతారు.

టెక్నిక‌ల్ టీం:
సాయికార్తిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాట‌లు మాత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ తో పాటు ఎన్నియాలో సాంగ్ విజువ‌ల్ గా బాగుంది. రాజా ది గ్రేట్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. మోహ‌న కృష్ణ విజువ‌ల్ ఫీస్ట్ చాలా బాగుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ను అందంగా చూపించాడు. త‌మ్మిరాజు ఎడిటింగ్ వ‌ర్క్ ఓకే. ఇక రొటీన్ క‌థ‌కు అంధుడు అనే ట్యాగ్ త‌గిలించి సేఫ్ అయిపోయాడు అనిల్. రొటీన్ క‌థ‌నే రాసుకున్నా.. హీరో అంధుడు అనే ఒకే లైన్ తో సినిమాను లాగించేసాడు. ఇదే కొత్త‌గా కూడా అనిపిస్తుంది. ప్ర‌తీ సీన్ లోనూ హీరోకు ఛాలెంజ్ లు పెట్టి దాన్నుంచి బ‌య‌ట ప‌డేసాడు. ఇందులోంచే ఆస‌క్తి పుట్టించాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా అనిల్ మ‌రోసారి రొటీన్ క‌థ‌తోనే సేఫ్ అయిపోయాడు. కామెడీ స‌న్నివేశాల ద‌గ్గ‌ర చాలా బాగా రాసుకున్నాడు అనిల్. ముఖ్యంగా రాజేంద్ర‌ప్ర‌సాద్, అన్న‌పూర్ణ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ జంధ్యాల త‌ర‌హా కామెడీని గుర్తు చేస్తాయి.

చివ‌ర‌గా: రాజా ది గ్రేట్.. ఓల్డ్ బ‌ట్ ఎంట‌ర్ టైన్డ్..

Rating:        3/5.0