రాజా ది గ్రేట్.. గ‌ట్టిగా కొట్టేలా ఉన్నారు.. 

ఏమో.. ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాకు ఇదే లైన్ బాగా సూట్ అవుతుందేమో..? ఎక్క‌డ చూసినా ఈ చిత్రంపై ఫుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అదేం విచిత్ర‌మో కానీ ర‌వితేజ‌కు రెండేళ్ల భారీ గ్యాప్ వ‌చ్చినా.. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు స‌రైన హిట్లు లేక‌పోయినా కూడా రాజా ది గ్రేట్ పై మాత్రం అంత‌టా పాజిటివ్ టాక్ ఉంది. ఒక‌ప్ప‌టి ర‌వితేజ సినిమాల‌తో పోలిస్తే.. రాజా ది గ్రేట్ పై అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. మాస్ రాజా ప్ర‌స్తుత మార్కెట్ తో ప‌నిలేకుండా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 45 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. ర‌వితేజ మ‌ళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లిపోయాడు. ఆయ‌న ఎన‌ర్జీ మ‌న‌కు స్క్రీన్ పై క‌నిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఏ ద‌ర్శ‌కుడు చేయ‌లేని విధంగా హీరోను అంధుడిగా చూపిస్తూ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇదే రాజా ది గ్రేట్ పై ఆస‌క్తి పెంచేస్తుంది. ప‌టాస్, సుప్రీమ్ లాంటి సూప‌ర్ హిట్ల త‌ర్వాత‌ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఇది.
ఇప్ప‌టికే సినిమా చూసుకున్న చిత్ర‌యూనిట్.. సంబ‌రాలు కూడా చేసుకున్నారు. నిన్న రాత్రి సినిమా చూసి బయటికి వచ్చిన చిత్ర బృందం 10,000 వాలాను అంటించేసి గోల గోల చేసారు. ఈ చిత్రం క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ఫిక్సైపోయారు చిత్ర‌యూనిట్. గ‌ట్టిగా కొడుతున్నాం అంటూ ధీమాగా చెబుతున్నాడు దిల్ రాజు. పైగా ఈ ఏడాది ఆయ‌న శ‌త‌మానం భ‌వ‌తి.. నేనులోక‌ల్.. డిజే.. ఫిదా సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. ఇప్పుడు ఐదో బాల్ కూడా బౌండ‌రీ అవ‌త‌లే ఉంటుందంటున్నాడు. సుప్రీమ్ లో పిల్లాడిని కాపాడటానికి హీరో ముందుకొస్తే.. ఇక్క‌డ హీరోయిన్ ను కాపాడ‌టానికి హీరో పాటు ప‌డుతుంటాడు. స్క్రీన్ ప్లే సేమ్ అయినా.. క‌థ‌లో మాత్రం ఏదో ట్విస్ట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. అదేంటో మ‌రికొన్ని గంట‌ల్లోనే తేల‌నుంది. ఈ చిత్రం కానీ హిట్టైందంటే తెలుగులో ఓ కొత్త ట్రెండ్ కు అనిల్ రావిపూడి తెర తీసిన‌ట్లే..!