నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ తదితరులు
జోనర్: రొమాంటిక్ ఎంటర్టైనర్
రిలీజ్ తేదీ: 29 నవంబర్ 2019
బ్యానర్: ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్, మీడియా9
నిర్మాతలు: మనోవికాస్ డీ, మనోజ్
సంగీతం: జయ్ క్రిష్
దర్శకత్వం : రవికిరణ్ కోలా
ముందు మాట:
మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద విజయం అందుకుంటున్న రోజులివి. అంతా కొత్తతరం నటీనటులతో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించాయి. ఆ కోవలోనే కొత్త కుర్రాళ్లతో తెరకెక్కి నేడు థియేటర్లలోకి రిలీజైన చిత్రం `రాజా వారు రాణి గారు`. ట్రైలర్ తో యువతరాన్ని ఆకర్షించిన చిత్రమిది. `సురేష్ డిస్ట్రిబ్యూషన్స్` ద్వారా ఈ సినిమా రిలీజైంది. అంత పెద్ద సంస్థ రిలీజ్ చేస్తోంది కాబట్టి ఈ సినిమాలో మ్యాటరెంత అన్న ఆసక్తి నెలకొంది. నిజంగానే ఆశించినంత మ్యాటర్ ఈ చిన్న సినిమాలో ఉందా లేదా అన్నది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథాకమామీషు:
రాజా (కిరణ్ అబ్బవరం) తన క్లాస్ మేట్ రాణి (రహస్య గోరఖ్)ని ప్రాణ సమానంగా ప్రేమిస్తాడు. టీనేజీ ప్రేమికుడు ఆ ప్రేమను చెప్పాలని ప్రయత్నించినా చెప్పలేడు. ఆ క్రమంలోనే రాణి విలేజ్ వదిలి పై చదువుల కోసం వెళుతుంది. చాలా కాలం తర్వాత తిరిగి గ్రామానికి వస్తుంది రాణి. అయితే తాను ఇష్టపడిన రాణీని ఊరికి రప్పించడానికి రాజా ఏం చేశాడు? చివరికి తన ప్రేమను చెప్పాడా లేదా? ప్రేమలో గెలిచాడా లేదా? ఈ ప్రేమకథలో రాజా స్నేహితుల భాగస్వామ్యం ఎంత? అన్నది తెరపైనే చూడాలి.
దర్శకుడు తన హృదయానికి దగ్గరైన ఓ కథను ఎంచుకుని ఈ సినిమా తీశారు. తొలి 15 నిమిషాల్లోనే కథను రివీల్ చేయడం అన్నది ఆకట్టుకుంది. తెర నిండుగా పల్లెటూరి అమాయకత్వం.. ప్రేమ కథల్లో ఫీల్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లవ్ స్టోరిని .. పల్లెల్లోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని.. అమాయకత్వాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఇద్దరు కొత్తవారైనా చక్కని నటనతో ఆకట్టుకున్నారు. సిగ్గుపడే ప్రేమికుడిగా అమాయకత్వం కలబోసిన యువకుడిగా అతడు చక్కగా పాత్రలోకి ఒదిగిపోయాడు. రహస్య అంతే అందంగా పాత్రలో ఒదిగిపోయింది. ఇక స్నేహితుల పాత్రలు అంతే చక్కగ కుదిరాయి.
అంతవరకూ బాగానే ఉంది కానీ .. ఈ సినిమాలో బోరింగ్ సన్నివేశాలతో కథనాన్ని పరిగెత్తించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. స్లో నేరేషన్ ఇబ్బందికరం. నాయిడు- చౌదరి మధ్య కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది. ఫస్టాఫ్ లవ్ రొమాన్స్ ఆకట్టుకున్నా సెకండాఫ్ లో ఎక్కువ ల్యాగ్ విసిగిస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కామెడీ నిల్. ఈ సినిమాలో క్లైమాక్స్ ఆకట్టుకుంది. అక్కడక్కడా కొన్ని మూవ్ మెంట్స్ ఆకట్టుకున్నా ఓవరాల్ గా సినిమా గతి తప్పిందనే చెప్పాలి.
కొత్త కుర్రాళ్లు అయినా అంతా బాగా నటించారు. ముఖ్యంగా నాయకానాయికలు కిరణ్-రహస్య నటనాభినయం సినిమా ఆద్యంతం మైమరిపిస్తుంది. రహస్య అందంతో పాటు డీసెంట్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. హీరో స్నేహితుల్లో రాజ్ కుమార్ కాశిరెడ్డి సహా హీరో స్నేహితులు చక్కని నవ్వుల్ని పండించారు.
టెక్నీషియన్స్:
ఎంచుకున్నది సింపుల్ లైన్ అయినా ఒక అందమైన గ్రామీణ వాతావరణంలో 90ల నాటి మృధుత్వాన్ని టీనేజీ ప్రేమకథను చూపించిన తీరు ఆకట్టుకుంది. అయితే అతడు కొంతవరకూ సక్సెసైనా.. సినిమాలో బోరింగ్ సీన్స్ మైనస్ అనిపిస్తాయి. ల్యాగ్ విసిగిస్తుంది. జే క్రిష్ సంగీతం ఫర్వాలేదు. చాలా సన్నివేశాల్లో నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. విద్యాసాగర్- అమర్ దీప్ కెమెరా పనితనం అద్భుతం. గ్రామాన్ని ఎంతో అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉంటే బావుండేది.
ప్లస్ పాయింట్స్:
*కిరణ్- రహస్య నటన
* కామెడీ సన్నివేశాలు
* క్లైమాక్స్.. ఎమోషన్
మైనస్ పాయింట్స్:
* రొటీన్ స్టోరి-స్క్రీన్ ప్లే
* స్లో నేరేషన్, ల్యాగ్
తీర్పు:
రాజా వారు రాణి గారు.. పల్లెటూరి ప్రేమకథ జస్ట్ ఓకే
రేటింగ్:
2.5/5