చిరుకు రాజమౌళి చేస్తోన్న హెల్ప్ ఏంటో తెలుసా?

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన కొత్త సినిమాపై ఎటువంటి క్లారిటీ ఇవ్వని జక్కన్న.. బయట అలా అలా మెరుస్తూ మీడియాకు పెద్దగా దొరక్కుండానే ఎంజాయ్ చేసేస్తున్నాడు. కానీ, ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హెల్ప్ చేయడానికి ముఖ్య అతిథిగా ఓ ఫంక్షన్ కు రాజమౌళి హాజరు కానున్నాడని తెలియడం ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది. అసలు విషయంలోకి వెళితే, మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ పేరిట ‘ఖైదీ నెంబర్ 150’ తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు 151వ సినిమా పేరిట చిరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ బయోపిక్ కు రెడీ అవుతుండటం.. దీనిని నేషనల్ లెవెల్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అందులో భాగంగానే ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఆగష్టు 22న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఉయ్యాలవాడ చిత్రంలో నటించబోయే కొందరు కీలక పాత్రధారుల స్కెచ్ లు కూడా ఆ రోజు చూపిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్రాండ్ గా జరగబోతున్న మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి రాబోతున్నారని తాజా సమాచారం. అందులోనూ ఇప్పుడు ఉయ్యాలవాడను మెగా నిర్మాత రామ్ చరణ్ బాహుబలి స్థాయిలో నిర్మించడానికి రెడీ అవుతుండటంతో.. రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయిస్తే సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ వస్తుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి రాజమౌళి నిజంగా మెగా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేస్తే.. ఆ హెల్ప్ చిరుకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.