ప్రభాస్ తో మళ్ళీ రాజమౌళి.. కథ రెడీ

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను నేషనల్ స్టార్ గా మార్చిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళికే దక్కుతుందని ఎప్పుడైనా సరే బల్లగుద్ది మరీ చెప్పొచ్చు.

మొదట ఛత్రపతి సినిమాతో టాలీవుడ్ కు ఓ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ హీరోని ఇచ్చిన జక్కన్న.. బాహుబలితో ప్రభాస్ ను దేశం మొత్తానికి ఓ సూపర్ హీరోను చేశాడు.

అందుకే వీరి కాంబో అంటే చాలు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. అయితే, బాహుబలి ది కంక్లూజన్ తో మాహిష్మతి ప్రపంచానికి సెలవిచ్చేయడంతో.. ఎవరికి వాళ్ళు తమ తమ సొంత ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు.

ఈ క్రమంలో ప్రభాస్ ఇప్పటికే సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ సినిమాను స్టార్ట్ చేసి.. నెక్స్ట్ జిల్ ఫేమ్ రాధాకృష్ణతో కూడా ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మరోవైపు, రాజమౌళి మాత్రం ఇంకా ఏ ప్రాజెక్టునూ ఫైనల్ చేయకుండా స్టోరీలు రెడీ చేయిస్తూ.. కొంచెం రెస్ట్ తీసుకుంటూ సరైన టైమ్ కోసం చూస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ప్రభాస్ – రాజమౌళి కాంబోను జనాలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్న విషయం అందరికీ తెలుసు.

వాళ్లకు కూడా ఒకరంటే ఒకరికి బోలెడంత ప్రేమ ఉంది కాబట్టి.. ఫ్యూచర్ లో చాలానే సినిమాలు చేయడానికి ఉత్సాహంగానే ఉన్నారు.

అయితే, ఇప్పటికి బాహుబలితోనే ఐదేళ్లకు పైగా జర్నీ చేసి ఉండటంతో.. ప్రస్తుతానికి గ్యాప్ తీసుకోవాలనే నిర్ణయించుకున్నారు.

దీంతో మళ్ళీ ఓ రెండు మూడేళ్ళ తర్వాతే ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో సినిమా ఉంటుందని సినీవర్గాలు కూడా ఫిక్స్ అయిపోయాయి.

కానీ, ఇప్పుడు ఉన్నట్టుండి తాజాగా వీరి కాంబోలో కొత్త సినిమా గురించి ఓ సరికొత్త అప్డేట్ బయటకు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఆ స్వీట్ షాకింగ్ న్యూస్ లోకి వెళితే, రాజమౌళి రీసెంట్ గా ప్రభాస్ కోసం ఓ అదిరిపోయే కథ రెడీ చేయించేశాడట.

అంతేకాదండోయ్.. ఆ కథ ఇప్పటికే ప్రభాస్ కు కూడా సరదాగా వినిపించేశాడట.

ఈ నేపథ్యంలో ఇద్దరూ ఆ కథకు ఫిక్స్ అయిపోయారని, ప్రస్తుతమున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక సినిమా చేసేయాలని నిర్ణయించేసుకున్నారని ఇన్నర్ సర్కిల్ లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు ఇప్పుడు రాజమౌళి ఆల్రెడీ కమిట్ అయిన ఇకరిద్దరు నిర్మాతలకు సినిమాలు చేసిపెట్టేలోపు.. ప్రభాస్ కూడా చేతిలో ఉన్న రెండు సినిమాలను పూర్తి చేసేస్తాడు కాబట్టి..

ఆ తర్వాత కుదిరితే ప్రభాస్ – రాజమౌళి కాంబో పట్టాలెక్కడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తుంది.

అంటే, మహా అయితే రెండేళ్ల లోపే వీరి కాంబోలో సినిమా వచ్చేస్తుందన్నమాట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, ఇప్పుడు రెడీ అయిన కథ బాహుబలిలా రాజులు, రాజ్యాలకు సంబంధించింది కాదని, ఓ పక్కా కమర్షియల్ స్టోరీ అని చెబుతుండటం ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. మరి ఇది ఎంతవరకు ఓకే అవుతుందో చూడాలి.

Follow US