రాజ‌మౌళి.. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మేది..?

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చాడు రాజ‌మౌళి. ఇండియాలో ఎవ‌రికీ తెలియ‌ని టెక్నిక‌ల్ హంగుల‌ను కూడా చూపించాడు. కానీ ఇన్ని చేసిన ద‌ర్శ‌కధీరుడు ఒక్క ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నాడు. అదే నెక్ట్స్ సినిమా ఏంటి..? అప్ప‌ట్లో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న కంటే ఇప్పుడు ఇదే ఎక్కువ ఫేమ‌స్ అయిపోయింది. అరే.. బాహుబ‌లితో ఐదేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు క‌దా ఐదు నెల‌లు విశ్రాంతి తీసుకుంటాడేమో అనుకున్నారు.. పైగా బాహుబ‌లికి ప‌ని చేసిన వాళ్ళంతా ఇప్పుడు మిగిలిన సినిమాల‌తో బిజీ అయిపోయారు. అంతెందుకు.. బాహుబ‌లికి క‌థ అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా శ్రీ‌వ‌ల్లి డైరెక్ట్ చేసాడు.. మెర్స‌ల్ కు క‌థ అందించాడు. కానీ రాజ‌మౌళి మాత్రం ఇప్ప‌టికీ మిన్నంట‌క ఉన్నాడు.

ఎంత‌మంది అడిగినా కూడా ఇప్ప‌టికీ స‌మాధానం మాత్రం చెప్ప‌డం లేదు. కనీసం తాను ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడో కూడా చిన్న క్లూ ఇవ్వ‌ట్లేదు రాజ‌మౌళి. ఆ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్.. ఎన్టీఆర్ లాంటి పేర్లు వినిపించినా కూడా ఏదీ ఫైనల్ కాలేదు. అయితే నిర్మాత మాత్రం డివివి దాన‌య్య అని ఫిక్సైపోయింది. ప్ర‌స్తుతం సినిమాలు లేక‌పోయినా.. అమ‌రావ‌తి ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. జ‌న‌వ‌రిలో త‌ర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వ‌నున్నాడు ఈయ‌న‌. ఇది ఏ హీరో అనేది కూడా అప్పుడే బ‌య‌టికి రానుంది. రామ్ చ‌ర‌ణ్ అని వినిపిస్తున్నా కూడా దీనిపై అయితే క్లారిటీ రావ‌డం లేదు. దాన‌య్య ద‌గ్గ‌ర రామ్ చ‌ర‌ణ్ డేట్స్ ఉండ‌ట‌మే దీనికి బ‌లం చేకూరుస్తుంది. పైగా ఈ మ‌ధ్య ఎక్కువ‌గా మెగా కంపౌండ్ లో క‌నిపిస్తున్నాడు జ‌క్క‌న్న‌. మొత్తానికి ఎటు చూసుకున్నా ఇప్పుడు మ‌గధీర కాంబినేష‌న్ మ‌ళ్లీ రిపీట్ అయ్యే ఛాన్సులు అయితే బాగానే క‌నిపిస్తున్నాయి. కానీ అదే త‌ర్వాతి సినిమా అని కూడా చెప్ప‌డం కష్టం. ఎందుకంటే అక్క‌డున్న‌ది రాజ‌మౌళి.. తాను ఎవ‌ర్ని కావాలంటే వాళ్ల‌ను పిక్ చేసుకుంటాడు. కానీ తాను పిక్ అవ్వ‌డు. మొత్తానికి రాజ‌మౌళి ఈ స‌స్పెన్స్ డ్రామాకు ఎప్పుడు తెర‌దించేస్తాడో?