ప్ర‌వీణ్ స‌త్తార్.. ఆ విష‌యంలో రాజ‌మౌళే..!

Last Updated on by

అదేంటి..? ప్ర‌వీణ్ స‌త్తార్ ను రాజ‌మౌళితో పోల్చ‌డం ఏంటి..? అస‌లు ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేని ప్ర‌వీణ్ ను రాజ‌మౌళితో పోల్చ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అనుకుంటున్నారా..? అవును.. నిజ‌మే రాజ‌మౌళితో ప్ర‌వీణ్ ను పోల్చ‌డం స‌రికాదు.. కానీ ఒక్క విష‌యంలో క‌చ్చితంగా రాజ‌మౌళికి ఏ మాత్రం తీసిపోడు ప్ర‌వీణ్ స‌త్తార్. అదే మార్కెటింగ్. ద‌ర్శ‌కుడు అంటే టైమ్ కు వ‌చ్చి.. ఆర్టిస్టుల‌ను బ్యాలెన్స్ చేసుకుని.. షూటింగ్ టైమ్ పూర్తికాగానే ప్యాక‌ప్ చెప్పేసి వెళ్ళిపోవ‌డం కాదు. అలాంటి వాళ్లే మ‌న ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా ఉన్నారు. త‌మ ప‌ని తాము చూసుకున్నామా..రెమ్యున‌రేష‌న్ తీసుకున్నామా
అనేది వాళ్ల‌కు కావాలి. కానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా మార్కెటింగ్ చూసుకుని.. దాన్ని ప్రేక్ష‌కుల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. బిజినెస్ ఎలా చేయాలి
అనే బాధ్య‌త మాత్రం చాలా త‌క్కువ మంది ద‌ర్శ‌కుల‌కు ఉంటుంది.

టాలీవుడ్లో ఈ ల‌క్ష‌ణాలు ఉన్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈయ‌న ఓ సినిమా టేక‌ప్ చేసాడంటే దాని ప్ర‌మోష‌న్.. మార్కెటింగ్.. బిజినెస్ కూడా జ‌క్క‌న్ననే చూసుకుంటాడు. మొత్తంగా అది త‌న సినిమా అనే ఫీలింగ్ తో ముందుకెళ్తాడు. ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి కూడా ప్రాణం పెడ‌తాడు రాజ‌మౌళి. ఒక్కో సినిమా కోసం ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌తాడు రాజ‌మౌళి. అంటే మిగిలిన ద‌ర్శ‌కులు ఇంత‌గా క‌ష్ట‌ప‌డ‌ర‌ని కాదు.. బిజినెస్ లో వాళ్లు త‌ల దూర్చ‌రు. అదంతా నిర్మాత‌ల ప‌ని అని కామ్ గా ఉంటారు. కానీ ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ కూడా రాజ‌మౌళి మాదిరే మారిపోయాడు. త‌ను తెర‌కెక్కించిన గ‌రుడ వేగ సినిమాకు అన్నీ తానే అయి ముందుండి న‌డిపించాడు.

గరుడవేగ చిత్రాన్ని ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డం నుంచి ప్ర‌మోష‌న్ వ‌ర‌కు అన్నీ ప్ర‌వీణ్ స‌త్తార్ త‌న భుజాల‌పై వేసుకున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా జీవిత చెప్పారు. ద‌ర్శ‌కుడిగా త‌న ప‌ని మాత్ర‌మే చూసుకోకుండా మార్కెటింగ్.. బిజినెస్ లోనూ అన్నీ తానే చూసుకుని నిర్మాత‌ల ప‌ని త‌గ్గించాడ‌ని.. ఇలాంటి ద‌ర్శ‌కులుంటే ఇండ‌స్ట్రీ చాలా బాగుంటుంద‌ని చెప్పింది జీవిత. రాజ‌శేఖ‌ర్ తో అంత బ‌డ్జెట్ పెడుతున్నా త‌న ప్లాన్స్ లో తాను ఉన్నాడు ప్ర‌వీణ్. తొలి టీజ‌ర్ ను రానా, కాజ‌ల్, ర‌కుల్ లాంటి వాళ్ళ‌తో రిలీజ్ చేయించి.. ట్రైల‌ర్ ను బాల‌య్య చేతుల మీదుగా విడుద‌ల చేయించి.. విడుద‌ల త‌ర్వాత చిరు మీటింగ్.. ఇలా అన్నీ ప్ర‌వీణ్ ప్లాన్ చేసాడు. మొత్తానికి ద‌ర్శ‌కుడు అంటే సినిమా మాత్ర‌మే తెర‌కెక్కించి.. మిగిలిన‌వి ప‌ట్టించుకోకుండా ఉండ‌టం కాదు.. అన్నీ తానే అవ్వాల‌నే సూత్రాన్ని న‌మ్ముతున్నారు ప్ర‌వీణ్ స‌త్తార్ అండ్ రాజ‌మౌళి లాంటి వాళ్లు.

Follow US 

User Comments