నాని తిక్క సినిమా.. రాజ‌మౌళి కౌంట‌ర్..!

Last Updated on by

నిర్మాత ఎవ‌రైనా తాను తీసిన సినిమా అద్భుతంగా ఉందంటాడు. కానీ నాని మాత్రం తాను తిక్క సినిమా చేసాన‌ని చెప్పాడు. దానికితోడు త‌న తిక్క కూడా చూపిస్తున్నాడు. తాను నిర్మించిన అ.. సినిమాను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో న్యాచుర‌ల్ స్టార్ కు బాగా తెలుసు. తాను న‌టించే సినిమాల విష‌యంలోనే ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండే నాని.. తాను డ‌బ్బులు పెట్టిన సినిమాపై ఇంకెంత జాగ్ర‌త్త తీసుకుంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు అ.. ప్రీ రిలీజ్ వేడుకలో కూడా నాని కాన్ఫిడెన్స్ ఏంటో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఈ చిత్రంలోని ప్ర‌తీ ఒక్క‌రినీ పేరుపేరునా పిలిచి పొగిడాడు నాని. ఇక టెక్నిక‌ల్ టీం గురించి కూడా చాలా చెప్పాడు న్యాచుర‌ల్ స్టార్. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రాన్ని 50 సినిమాల అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించాడ‌ని.. తాను నిర్మాత‌గా చాలా సేఫ్ జోన్ లో ఉన్నాన‌ని చెప్పాడు నాని.

ఇక ఇదే వేడుక‌కు వ‌చ్చిన రాజ‌మౌళి కూడా అ.. సినిమా గురించి అద్భుతంగా మాట్లాడాడు. ఈ చిత్రం క‌చ్చితంగా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేసాడు ద‌ర్శ‌కధీరుడు. వ‌ర‌స విజ‌యాలు సాధిస్తున్న నానికి తాను కొత్త‌గా ఏదైనా ట్రై చేయ్ అని మెసేజ్ పెడితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేప‌గా మారాడ‌ని సెటైర్ వేసాడు రాజ‌మౌళి. ఇక అనుష్క కూడా అ.. సినిమాకు బెస్ట్ విషెస్ చెప్పింది. నాని సినిమా చేస్తున్నాడంటే క‌చ్చితంగా హిట్ అనే న‌మ్మ‌కం వ‌చ్చేసింద‌ని.. ఈ చిత్రం కూడా బాగా ఆడుతుంద‌ని చెప్పింది స్వీటీ. కాజ‌ల్.. నిత్యామీన‌న్.. ప్రియ‌ద‌ర్శి.. రెజీనా.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రినీ స్టేజ్ పైకి పిలిచి వాళ్ల‌ను అభిమానుల‌తో ప్ర‌శ్న‌లు అడిగించారు. కానీ ఇంత చేసినా.. ట్రైల‌ర్ విడుద‌లైనా కూడా అ.. సినిమా గురించి ఇంత క్లూ కూడా బ‌య‌టికి రాలేదు. ఇందులో ఏముందో తెలుసుకోవాలంటే మాత్రం క‌చ్చితంగా ఫిబ్ర‌వ‌రి 16 వ‌ర‌కు ఆగాల్సిందే..!

User Comments