రాజమౌళి విఆర్.. శంకర్ 3డి..

ఈ రోజుల్లో తాము ఎలాంటి సినిమాలు చేస్తున్నాం అని కాదు.. ఎంత టెక్నాల‌జీతో సినిమాలు చేస్తున్నాం అనేది చూస్తున్నారు ద‌ర్శ‌కులు. ఒక‌రు ఆ టెక్నాల‌జీ వాడితే.. మ‌రొక‌రు దాన్ని మించిన టెక్నాల‌జీని ప‌ట్టుకొస్తున్నారు. బాహుబ‌లి కోసం వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని తీసుకొచ్చాడు రాజ‌మౌళి. దీనివల్ల నిజంగానే మ‌నం ఆ యుద్ధ రంగంలో ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇప్పుడు 2.0 కోసం పూర్తిగా 3డి మేకింగ్ ప‌రిచ‌యం చేస్తున్నాడు శంక‌ర్. కొన్ని హాలీవుడ్ సినిమాల‌కు కూడా మేకింగ్ త‌ర్వాత 3డిలోకి మారుస్తారు. కానీ 2.0 కోసం మాత్రం మేకింగ్ టైమ్ లోనే 3డి కెమెరాల‌తో షూట్ చేస్తున్నారు. ఇండియాలో ఇలాంటి ఓ సినిమా రూపొంద‌డం ఇదే తొలిసారి. హాలీవుడ్ లోనూ ఇలాంటి సినిమాలు అరుదుగా వ‌స్తుంటాయి. ఈ విచిత్రాన్ని ఇప్పుడు మ‌నకోసం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు.

తాజాగా 2.0 3డి మేకింగ్ వీడియో విడుద‌లైంది. 400 కోట్ల‌తో శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నాడు. మేకింగ్ చూస్తుంటేనే సినిమా రేంజ్ ఏంటో అర్థ‌మైపోతుంది.  ఈ చిత్ర ఆడియో దుబాయ్ లో అక్టోబ‌ర్ 27న జ‌ర‌గ‌బోతుంది. కేవ‌లం చెన్నై, ముంబై నుంచి దుబాయ్ కు అతిథుల‌ను తీసుకెళ్ల‌డానికే 3 ఛార్టెట్ ప్లైట్స్ బుక్ చేసారు. బ‌డ్జెట్ 400 కోట్లు దాటితే.. మార్కెటింగ్ కోసం 40 కోట్లు పెడుతున్నారు. దుబాయ్ లోని బూర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర 2.0 ఆడియో విడుద‌ల కానుంది. డిసెంబ‌ర్ 12న ర‌జినీ పుట్టిన‌రోజు కానుక‌గా సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక జ‌న‌వ‌రి 25న 2.0 సినిమా విడుద‌ల కానుంది. 2.0 వ‌చ్చిన మూడు నెల‌ల‌కే కాలా కూడా విడుద‌ల కానుంద‌ని తెలుస్తోంది. అంటే మూడు నెల‌ల గ్యాప్ లోనే మ‌రో సినిమాతో రావ‌డం చిన్న విష‌యం కాదు. ర‌జినీలో ఈ స్పీడ్ రాజ‌కీయాల కోస‌మే అనే వార్త‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.