ఆర్‌.ఆర్‌.ఆర్‌… రౌద్రం ర‌ణం రుధిరం

అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మొత్తానికి పండ‌గ ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. క‌రోనా తెచ్చిన క‌ష్టంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న జ‌నాల‌కి కాస్త ఉప‌శ‌మ‌నంగా నిలిచింది ఆయ‌న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌. ఉగాదిని పుర‌స్క‌రించుకుని `ఆర్‌.ఆర్‌.ఆర్‌` టైటిల్ లోగోని, మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేస్తున్నాన‌ని నిన్న‌నే వెల్ల‌డించాడు రాజ‌మౌళి. చెప్పిన‌ట్టుగానే ఈ రోజు 12 గంట‌ల‌కి మోష‌న్ పోస్ట‌ర్ని విడుద‌ల చేశారు. ఆర్‌.ఆర్‌.ఆర్ అనే టైటిల్ కొన‌సాగిస్తూనే, ఆ అక్ష‌రాల‌కి అర్థం ఏమిటో టైటిల్‌లో చెప్పారు రాజ‌మౌళి.

రౌద్రం ర‌ణం రుధిరం అంటూ ఆర్‌.ఆర్‌.ఆర్ టైటిల్ వెన‌క అంత‌రార్థాన్ని చెప్పారు రాజ‌మౌళి. నీరు, నిప్పులాంటి ఇద్ద‌రు వ్య‌క్తుల క‌థ అని మోష‌న్‌పోస్ట‌ర్‌నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. నీరులాంటి వ్య‌క్తిగా ఎన్టీఆర్‌, నిప్పులాంటి వ్య‌క్తిగా రామ్‌చ‌ర‌ణ్ తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారు. వీళ్లిద్ద‌రిలో ఒక‌రు కొమ‌రం భీమ్‌గా, మ‌రొక‌రు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 1920నాటి క‌థ అని గుర్తు చేసేలా టైటిల్‌ని డిజైన్ చేశారు. ఈ సినిమాని సంక్రాంతి సంద‌ర్భంగా వచ్చే యేడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌బోతున్నారు.