చిరంజీవిని త‌ల‌చిన ర‌జ‌నీ

Last Updated on by

సౌత్ ఫిలింఇండ‌స్ట్రీలో ఎదురేలేని సూప‌ర్‌స్టార్ ఎవ‌రు? అంటే ముందుగా ర‌జ‌నీకాంత్‌నే త‌ల‌చుకుంటారంతా. ఆయ‌న స్టార్‌డ‌మ్ అలాంటిది. కంటి చూపుతో శాసించే స‌త్తా ఉన్న ఏకైక సౌత్ స్టార్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాస్ స్టార్ ఇండియాలోనే ఆయ‌నొక్క‌రే. అందుకే సౌత్‌లో సూప‌ర్‌స్టార్ అన్న మాట వినిపించ‌గానే ర‌జ‌నీకాంత్‌ని త‌ల‌చుకుని అటుపై ఇత‌ర స్టార్ల‌ను గుర్తు చేసుకుంటారు. ఈరోజు హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగిన `కాలా` ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో కాలా నిర్మాత కం అల్లుడు ధ‌నుష్ .. ర‌జ‌నీని ఓ రేంజులో పొగిడేశాడు. ఒకే ఒక్క ర‌జ‌నీకాంత్“.. ఆయ‌న‌ ఒక్క‌రు మాత్ర‌మే. అలా వేరొక‌రు ఉండ‌రు… అని పొగిడేశాడు.

అయితే దానికి ర‌జ‌నీ ఇచ్చిన రిప్ల‌య్ అంతే షాకింగ్‌. “ధ‌నుష్ చెప్పారు.. ర‌జ‌నీకాంత్ ఒక్క‌రేన‌ని. నేను మాత్ర‌మేనా? ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున‌, ఒకే వెంక‌టేష్ … వీళ్లు కూడా ఒకే ఒక్క‌రు క‌దా!“ అని అన్నారు. ఏ రంగంలో అయినా వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ల‌డాన్ని బ‌ట్టే ఉంటుంది. అవ‌కాశాన్ని మాత్రం అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు.. అని ర‌జ‌నీ అన్నారు. తెలుగు ప్రేక్ష‌కులు త‌మిళ ప్రేక్ష‌కుల్లానే న‌న్ను ప్రేమించారు. నా తొలి తెలుగు చిత్రం `అంతులేని క‌థ‌`(1978). ఆ త‌ర‌వాత మోహ‌న్‌బాబు పెద‌రాయుడుతో మ‌రో బ్రేక్ వ‌చ్చింది. భాషా, ముత్తు, న‌ర‌సింహా వంటి చిత్రాలు గొప్ప బ్రేక్‌నిచ్చాయి. ఆరోజుల్లో పెద్దాయ‌న ఎన్టీఆర్ ఆశీర్వాదం తీసుకునేవాడిని. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ గుర్తుకు వ‌స్తున్నారు.. అంటూ ర‌జ‌నీ ఎంతో వినమ్రంగా త‌న స్పీచ్‌ని ప్రారంభించ‌డం అంద‌రి హృద‌యాల్ని తాకింది. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌ని ఓ బిడ్డ‌లా చూసుకునేవార‌ని ఇప్పుడు ఆయ‌న లేర‌ని జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు ర‌జ‌నీ. సూప‌ర్‌స్టార్ న‌టించిన‌ కాలా ఈ నెల 6న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

User Comments