2.0.. ఈ ఆట‌లేంటి ర‌జినీ గారూ..?

ర‌జినీకాంత్ అంటే త‌మిళ హీరో కాదు.. ఇండియ‌న్ హీరో. ఒక్క‌డే సూప‌ర్ స్టార్.. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ఇండ‌స్ట్రీతో ప‌నిలేకుండా అంతా వేచి చూస్తుంటారు. ఇప్పుడు 2.0 కోసం కూడా అలాగే వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ నిర్మాత‌ మాత్రం 2.0 విడుద‌ల తేదీతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు సౌత్ ఇండియాతో పాటు మొత్తం ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో 2.0 రిలీజ్ గురించే చ‌ర్చ. ఈ చిత్రం ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపైనే చాలా సినిమాల ఫ్యూచ‌ర్ ఆధార‌ప‌డి ఉంది. ఏప్రిల్ 27న విడుదల అంటూ సంచ‌ల‌నం రేపారు లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రిలోపు ఫ‌స్ట్ కాపీ కూడా రెడీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు శంక‌ర్. టీజ‌ర్ కూడా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయాల‌నేది శంక‌ర్ ప్లాన్. ఇక మార్చ్ లో ట్రైల‌ర్.. ఏప్రిల్ లో సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జ‌న‌వ‌రి నుంచి మార్చ్ వ‌ర‌కు మూడు నెల‌లు కేవ‌లం ప్ర‌మోష‌న్ కే కేటాయించ‌నున్నాడు.

ముందుగా అనుకున్న‌ట్లు కాకుండా లేనిపోని పోటీలు ఎందుకని 2.0 నిర్మాత‌లే వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లు త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 27న కాకుండా 13నే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. నిజానికి ఏప్రిల్ 14న త‌మిళ ఉగాది. కానీ ఒక రోజు ముందే అభిమానుల‌కు కానుక సిద్ధం చేస్తున్నారు 2.0 యూనిట్. తెలుగు, తమిళ్ తో సహా మొత్తం 15 భాషలలో 2డి, 3డి ఫార్మెట్ లో 2.0 విడుదల కానుంది. ఏప్రిల్ 27న విడుదల చేయాల‌నుకున్నా ఆ రోజు మహేష్ నటించిన భరత్ అనే నేను.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలు విడుద‌ల కానున్నాయి. రజనీ సినిమా కూడా అదే రోజు వ‌స్తే థియేటర్స్ సమస్యతో పాటు వ‌సూళ్ల పరంగానూ భారీ న‌ష్టాలు త‌ప్పవు. అందుకే నిర్మాత‌లు కూడా గోల పెట్టారు. అందుకే 2.0 నిర్మాత‌లే కాంప్రమైజ్ అయిపోయారు. త‌మ సినిమానే రెండు వారాలు ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి సింగం రేస్ నుంచి త‌ప్పుకోవ‌డంతో మిగిలిన హీరోలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

User Comments