ర‌జినీకాంత్ కు కర్ణాట‌క‌ కష్టాలు

Last Updated on by

ర‌జినీకాంత్ అంటే ఇన్నాళ్లూ కేవ‌లం హీరో మాత్ర‌మే.. కానీ ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుడు కూడా. ఈ మ‌ధ్యే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేసాడు ఈ సూప‌ర్ స్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఇంకా పెట్ట‌క‌పోయినా కూడా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానంటూ ప్ర‌క‌టించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈయ‌న సినిమాల‌పై కూడా రాజ‌కీయాలు క‌మ్ముకుంటున్నాయి. తాజాగా ఈయన న‌టించిన కాలా జూన్ 7న విడుద‌ల కానుంది. తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అస‌లే చాలా వాయిదాల త‌ర్వాత వ‌స్తోంది కాలా. ఏ అడ్డంకి లేకుండా వ‌చ్చి వ‌సూళ్లు కుమ్మేసుకోవాల‌ని చూస్తున్న ర‌జినీకాంత్ కు ఇప్పుడు క‌ర్ణాట‌క రూపంలో అస‌లు నాట‌కం మొద‌లైంది. అక్క‌డ కాలాను అడ్డుకునే ప‌రిస్థితులు ఉన్నాయి.

కావేరీ జ‌లాల ఇష్యూలో రెండు రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వ‌లు చాలా రోజులుగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కాలాకు కూడా ఇది అడ్డుగా మార‌బోతుంది. ఈ మ‌ధ్యే త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ మీటింగ్ లో క‌ర్ణాట‌క‌కు వ్య‌తిరేకంగా మాట్లాడాడు ర‌జినీ. దాంతో క‌న్న‌డిగులు కోపంతో ర‌గిలిపోతున్నారు. క‌ర్ణాట‌క‌లోనే పెరిగి.. అక్క‌డే ఉద్యోగం చేసిన ర‌జినీ అన్నం పెట్టిన రాష్ట్రం గురించి త‌ప్పుగా మాట్లాడ‌తాడా అంటూ ఊగిపోతున్నారు. క్ష‌మాప‌ణ‌లు చెబితే కానీ కర్ణాట‌క‌లో కాలాను విడుద‌ల కానివ్వ‌మంటూ భీష్మించుకు కూర్చున్నారు అక్క‌డి రాజ‌కీయ సంఘాలు. గ‌తంలో బాహుబ‌లి 2 అప్పుడు కూడా ఇదే జ‌రిగితే.. స‌త్య‌రాజ్ తో సారీ చెప్పించాడు రాజ‌మౌళి. మ‌రి ఇప్పుడు ర‌జినీకాంత్ ఏం చేస్తాడో..!

User Comments