కాలా వ‌స్తున్నాడు.. రాసి పెట్టుకోండి

Last Updated on by

కాలా.. కాలా.. ఇప్పుడు ర‌జినీకాంత్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఎప్పుడు ఈ సినిమాను చూద్దామా అన్న‌ట్లున్నారు వాళ్లు. రెండేళ్లైపోయింది అప్పుడే ర‌జినీకాంత్ ను స్క్రీన్ పై చూసి. ఇక‌పై ఎప్పుడు చూస్తామో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయ‌న రాజ‌కీయాల్లో బిజీ క‌దా..! అందుకే చివ‌ర్లో చేసే ఈ సినిమాల‌ను అపురూపంగా చూసుకోవాల‌ని ఆశ ప‌డుతున్నారు ర‌జినీ ఫ్యాన్స్. దీనికంటే ముందు రావాల్సిన 2.0 విష‌యంలో శంక‌ర్ అభిమానులను మాటిమాటికి మోసం చేస్తుంటే.. రంజిత్ మాత్రం నేనున్నాను అంటూ వ‌స్తున్నాడు. ఫ్యాన్స్ మ‌నోవేద‌న‌ను అర్థం చేసుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు కాలా టీజ‌ర్ మార్చ్ 10న వ‌స్తుందంటూ చిన్న హింట్ ఒక‌టి విడుద‌ల చేసారు.

అది వ‌స్తుందో రాదో తెలియ‌దు కానీ వ‌స్తుంద‌నే వార్త‌తోనే పండ‌గ చేసుకుంటున్నారు అభిమానులు. అదే క‌దా అభిమానం అంటే మ‌రి. ఇప్ప‌టికే కాలా చిత్ర షూటింగ్ పూర్తయింది. ర‌జినీ డ‌బ్బింగ్ కూడా పూర్తి చేసాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో బిజీగా ఉంది ఈ సినిమా. ఏప్రిల్ 27న సినిమా విడుద‌ల కానుంది. దానికి ముందు రోజు బ‌న్నీ, మ‌హేశ్ సినిమాలు వ‌స్తున్నా కూడా తాను మాత్రం అదే రోజు వ‌స్తానంటున్నాడు సూప‌ర్ స్టార్. అంతేలే.. పెద్ద సూప‌ర్ స్టార్ ను చూసి చిన్నోళ్లు వెన‌క్కి వెళ్లాలి కానీ చిన్నోళ్ల‌ను చూసి పెద్దోడెప్పుడైనా వెన‌క‌డుగు వేస్తాడా..? ఇందులో మ‌రోసారి మాఫియా డాన్ గానే న‌టిస్తున్నాడు ర‌జినీకాంత్. ఇది వ‌ర‌కు చాలా సినిమాలు నిర్మించిన ధ‌నుష్.. తొలిసారి మావ‌య్య హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నాడు. మ‌రి.. కాలా ఎలా ఉండ‌బోతున్నాడో..?

User Comments