ర‌జినీ మ‌రో చిరంజీవా.. ఎన్టీఆరా..?

Last Updated on by

సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇప్ప‌ట్నుంచి వ‌స్తోన్న ఆనవాయితీ కాదు. కొన్ని దశాబ్ధాలుగా జ‌రుగుతుంది అది. పార్టీ పెట్టిన 9 నెల‌ల‌కే ముఖ్య‌మంత్రి అయిన వాళ్లు కూడా ఉన్నారు మ‌న దేశంలో. ఇక త‌మిళ‌నాట అయితే సినిమా పాలిటిక్స్ మ‌రింత ఎక్కువ‌. అక్క‌డ రాజ‌కీయాల‌ను రాజ్య‌మేలిన వాళ్ల‌లో సినిమా వాళ్లే ఎక్కువ‌. మొన్న‌టి వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉన్న జ‌య‌ల‌లిత సైతం సినిమాల నుంచే వ‌చ్చింది. ఇక ఇప్పుడు ర‌జినీకాంత్ కూడా స‌స్పెన్స్ కు తెర‌దించుతూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఈయ‌న కొత్త పార్టీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికైతే తాను 2019లో పోటీకి సై అని సంకేతమిచ్చాడు సూప‌ర్ స్టార్. 234 స్థానాల్లోనూ త‌న పార్టీ పోటీ చేస్తుంద‌ని క్లారిటీ ఇచ్చాడు ర‌జినీకాంత్. రాజకీయాల్లో పేరుకుపోయిన కుళ్లును క‌డిగేందుకే త‌ను వ‌స్తున్నాన‌ని డైలాగులు పేల్చాడు సూప‌ర్ స్టార్.

త‌న పార్టీ ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోతే మూడేళ్ల‌లో రాజీనామా చేస్తాన‌ని ఓపెనింగ్ రోజే క్లైమాక్స్ డైలాగ్ చెప్పాడు ర‌జినీకాంత్. త్వ‌ర‌లోనే పార్టీ వివ‌రాల‌న్నీ చెప్తాన‌ని చెప్పాడు ర‌జినీకాంత్. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ పార్టీల‌న్నీ ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్నాయ‌ని.. ఎవ‌డు ప‌డితే వాడు పార్టీలు పెట్టి ప్ర‌జ‌ల సొమ్ము అప్ప‌నంగా తినేస్తున్నార‌ని ఘాటు విమ‌ర్శ‌లే చేసాడు ర‌జినీకాంత్. ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంటే చూస్తూ ఉండ‌లేకే త‌ను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. ఇప్పుడు కూడా తానేం చేయ‌క‌పోతే అంత కంటే వ్య‌ర్థ‌మైన ప‌ని మ‌రోటి ఉండ‌ద‌న్నాడు సూప‌ర్ స్టార్. ర‌జినీ ఇలా పార్టీ గురించి అనౌన్స్ చేసారో లేదో అప్పుడే కొంద‌రు విమ‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. బిజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అయితే ర‌జినీకి చదువు సంధ్య‌ల్లేవు ఏం చేస్తాడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అంటూ విమ‌ర్శించాడు. ఆయ‌న‌పై ర‌జినీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇక ఇప్పుడు ర‌జినీకాంత్ రాజ‌కీయ అరంగేట్రం అంద‌ర్లోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి వ‌చ్చిన‌పుడు చూపించే శ్ర‌ద్ధా.. దాన్ని న‌డిపించ‌డంలో చూపించ‌ర‌నే రూమ‌ర్ ఉంది. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. ఎన్టీఆర్.. ఎంజిఆర్.. జ‌య‌ల‌లిత లాంటి వాళ్లు మిన‌హాయిస్తే సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన వాళ్లు చాలా త‌క్కువ‌. చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావుగా మారిపోయాడు. ఈయ‌న ఎటూ తేల్చుకోలేక పాలిటిక్స్ వ‌దిలేసి మ‌ళ్లీ సినిమా బాట ప‌ట్టాడు. త‌మిళ‌నాట కూడా శ‌ర‌త్ కుమార్.. విజ‌య్ కాంత్ లాంటి వాళ్లు సొంత పార్టీలు పెట్టి చేతులెత్తేసారు. ఇప్పుడు ర‌జినీ వ‌స్తున్నాడు. మ‌రి ఈయ‌న ఎంజిఆర్.. ఎన్టీఆర్ లా చ‌రిత్ర సృష్టిస్తాడా.. చిరంజీవి, విజ‌య్ కాంత్ లా చ‌రిత్ర‌లో క‌లిసిపోతాడా అనేది చూడాలిక‌..!

User Comments