హాట్ టాపిక్ గా రజినీ 2.0 తెలుగు డీల్

 

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినా ఏంటో అందరికీ తెలుసు. ముఖ్యంగా తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రజినీ సృష్టించే రికార్డులు భాషతో సంబంధం లేకుండా ఉంటాయి. అయితే, ఈ మధ్య తెలుగుకు వచ్చేసరికి రజినీ సినిమాలు మన బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేక.. అంచనాలను అందుకోలేక డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలనే మిగుల్చుతున్నాయి. అయినా సరే రజినీ కొత్త సినిమా వస్తుందంటే చాలు, మార్కెట్ లో కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్ చేస్తుండటం చూస్తుంటే సూపర్ స్టార్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా రజినీ కొత్త సినిమా 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ పేరిట సెట్ చేస్తున్న షాకింగ్ ఫిగర్స్ చూస్తుంటే.. ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.
అసలు విషయంలోకి వెళితే, రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న రోబో సీక్వెల్ 2.0 తాజాగా తెలుగు హక్కుల డీల్ ను క్లోజ్ చేసుకుందని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అందులోనూ బాహుబలి-2 ను నైజాంలో రిలీజ్ చేసిన సంస్థే ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తుందని తెలియడం.. ఇలా ఆరు నెలల ముందే డీల్ పూర్తయిపోయిందని అంటుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా 2.0 చిత్రాన్ని నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ ఓ ప్రకటన చేస్తూ.. సునీల్ నారంగ్ నేతృత్వంలోని గ్లోబల్ సినిమాస్ భాగస్వామ్యంతో 2.0 ను తెలుగులో విడుదల చేయబోతున్నామని, దానికి సంబంధించిన రైట్స్ ను భారీ ధరకు విక్రయించామని పేర్కొంది. అయితే, ఎంత రేటుకు డీల్ క్లోజ్ అయిందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
కానీ, తాజా  ఇన్నర్ టాక్ ప్రకారం మాత్రం.. ఈ డీల్ రూ. 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల మధ్య ఫినిష్ అయిందని తెలుస్తోంది. దీంతో సినీవర్గాలు సైతం షాక్ అయిపోతున్నాయి. చివరగా రజినీ కబాలి సినిమాను తెలుగులో దాదాపు 32 కోట్ల రూపాయలకు అమ్మితే.. సినిమా ఏవరేజ్ గా నిలిచి నష్టాలనే మిగిల్చింది. అలాగే గతంలో లింగా, విక్రమసింహ లాంటి రజినీ సినిమాలు అయితే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ను నట్టేట ముంచేశాయి. కానీ, రజినీ – శంకర్ కాంబోలో వచ్చిన రోబో మాత్రం దాదాపుగా రూ. 30 కోట్లు పెట్టి కొన్నా సరే అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో.. ఆ టైమ్ లో భారీగానే లాభాలు దక్కాయి. ఆ ఆశతోనే ఇప్పుడు రోబో 2.0 కు ఆ రేటు పలికిందని అంటున్నారు. అందులోనూ బాహుబలి -2 సక్సెస్ ను చూశాక.. మార్కెట్ పరిధి అనూహ్యంగా పెరిగినట్లు కనిపించడంతో మన డిస్ట్రిబ్యూటర్స్ ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ రిస్క్ చివరకు ఎలాంటి ఫలితాన్ని చూపిస్తుందో చూడాలి.