రకుల్‌ప్రీత్‌సింగ్ : అచ్చం భ్రమరాంబలా వార్నింగ్ ఇచ్చేశా!

రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు అచ్చ తెలుగమ్మాయి అయిపోయింది. ఆ విషయంలో ఇంకా ఏమైనా అనుమానాలుంటే `రారండోయ్… వేడుక చూద్దాం` ట్రైలర్ చూశాక అవి కూడా మాయమైపోతాయి. లంగాఓణీతోనూ, చూడీదార్లతో మన పక్కింటి అమ్మాయిని తలపిస్తూ ఆమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

భ్రమరాంబగా నటించిన రకుల్ ఆ పాత్ర గురించి చాలా గొప్పగా చెబుతోంది. ఎంతోమంది స్టార్ కథానాయకుల చిత్రాల్లో నటించిన ఆమె ఎప్పుడూ ఏ సినిమాలోనూ తన పాత్ర గురించి ఇంతగా చెప్పింది లేదు. మరి ఆ పాత్రలో ఏముందో, రకుల్‌కి అంతగా ఏం నచ్చిందో ఆమెనే అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేసింది `మై ఫస్ట్ షో.కామ్`.

*భ్రమరాంబ భ్రమరాంబ అంటూ చాలా చెబుతున్నారు. ఏంటా పాత్ర గొప్పదనం? 

ఇప్పటిదాకా నేను చేయనటువంటి ఓ కొత్త పాత్ర. పల్లెటూరి అమ్మాయిగా నటించాను కానీ.. ఈ తరహా బాడీలాంగ్వేజ్, ఈ తరహా ఆలోచనలతో కూడిన అమ్మాయిగా మాత్రం నటించలేదు.

`నేను ముందే చెబుతున్నా, .. ఆ తర్వాత నీ ఇష్టం` అని చెప్పి మరీ చేసేసే అమ్మాయి. తెలుగు ఇళ్లల్లో ఇలాంటి అమ్మాయిలా చాలానే కనిపిస్తుంటారు. అలాంటి ఓ యునిక్ పాత్రని నేను చేయడం విశేషమే కదా!

* భ్రమరాంబ పాత్రకీ, మీ నిజ జీవితానికి మధ్య పోలికలేమైనా ఉన్నాయా? –

అస్సలు లేవు. నాది ఆర్మీ కుటుంబం. దాంతో మా ఇంట్లో పెంకితనం, మొండితనం పనిచేయవు. చెప్పింది చేయాలి. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. అలాగని స్ట్రిక్ట్ అని చెప్పను కానీ.. క్రమశిక్షణ ఎక్కువ.

కానీ ఈ సినిమా చేశాక మాత్రం నేను కూడా కొంచెం భ్రమరాంబలా మారిపోయా. పాత్రలాగే దర్శకుడికి ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశా. `తర్వాత నీ సినిమాలో నేనే హీరోయిన్ని. లేదంటే తర్వాత నీ ఇష్టం` అని కల్యాణ్‌కృష్ణతో చెప్పా.

నిన్ను భ్రమరాంబని చేస్తే, ఆ ప్రతాపం నాపైనే చూపిస్తావా అని కల్యాణ్ భయపడిపోయాడు (స్మైల్).

* నాగచైతన్యతో తొలిసారి నటించారు కదా? –

నటించడం తొలిసారే కావొచ్చు కానీ.. నేను తను చాలా రోజులుగా స్నేహితులం. దాంతో మేం సెట్లో కూడా కొత్తగా ఏమీ అనిపించలేదు. వెంటనే కలిసిపోయాం.

మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అదంతా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం వల్లే.

దానికితోడు కల్యాణ్‌కృష్ణ కూడా ఆ పాత్రల్ని అలా తీర్చిదిద్దాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నా పాత్ర గురించి మాట్లాడుకొంటారు.

అంత బలంగా ఉంటుంది ఆ పాత్ర. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. నేను  ఖచ్చితంగా బల్లగుద్ది మరీ  చెప్పే విషయమిది.

*  కుటుంబ కథ కదా ఇది, మరి మీ కుటుంబం గుర్తుకొచ్చిందా? –

సెట్లో అంత టైమ్ ఉండదు కదండీ. అంతా హడావుడిగా ఉంటుంది. ఆ వాతావరణంలో కుటుంబం గుర్తకు రావడమంటూ ఏమీ ఉండదు.

అయితే సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది.  ఇక తెలుగు ప్రేక్షకులైతే పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని బాబాయ్.. ఇలా అందరినీ గుర్తుకు తెచ్చుకుంటారు.

* మీకొస్తున్న కథలు, పాత్రల విషయంలో సంతృప్తిగానే ఉన్నారా? –

ఖచ్చితంగా. ప్రతిసారీ బలమైన పాత్రలే దొరకవు. తెలుగులో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే తెరకెక్కుతుంటాయి. కమర్షియల్ అంటేనే హీరో ప్రధానమైన సినిమాలు.

అలాంటప్పుడు మా కథానాయికల పాత్రలకి ప్రాధాన్యం ఉండాలనుకోవడం తప్పు. ఉన్నంతలో ఆకట్టుకొనేందుకు ప్రయ్నతిస్తుంటాం. కానీ అప్పుడప్పుడు మాకోసమని `రారండోయ్..`లాంటి చిత్రాలు తెరకెక్కుతుంటాయి.

అలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మరింత తృప్తిగా నటిస్తుంటాం.

* వరుస విజయాలు మీపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? –

విజయాల గురించి పట్టించుకొని, వాటినే చూస్తూ పొంగిపోతూ కూర్చుంటే ఇక్కడ పనులు కావు. ఒక్క పరాజయం ఎదురైందనుకోండి, ఈ అమ్మాయికి హిట్టు పడక చాలా రోజులైంది.అర్జంటుగా హిట్టు కావాలి అని మీరే రాస్తారు. అందుకే నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోను. ముందు నా పనిపై నేను దృష్టిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటా.

* మిమ్మల్ని గోల్డెన్ లెగ్, లక్కీ మస్కట్ అనే పేర్లతో పిలుస్తుంటారు కదా…  –

వాటిని నేను నమ్మంటారా? అయినా ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి నేనే  కారణం అని నేనెలా అనుకొంటాను? దర్శకుడు, ఇతర చిత్రబృందం, నేను… ఇలా అందరూ కష్టపడితేనే విజయాలొస్తాయి.

ఒక్కరివల్ల ఏదీ సాధ్యం కాదు. అందుకే నాకు పరాజయాలు ఎదురైనా దానికి నేను కారణం కాదంటాను, విజయాలొచ్చినా నేను కారణం కాదని చెబుతాను.

* స్పైడర్‌లో ఎలా కనిపించబోతున్నారు? –

డాక్టర్‌గా కనిపిస్తా. ఆ సినిమా కోసం మహేష్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. సెట్లో ఆయన నడుచుకొనే విధానం ముచ్చటగా అనిపించింది. అది కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

Follow US