రకుల్ ప్రీత్ సింగ్ నోట.. అనుష్క వయస్సు మాట  

Last Updated on by

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. ముందుగా అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత బాహుబలి లాంటి భారీతనమున్న చిత్రం, సైజ్ జీరో లాంటి ప్రయోగం, వేదం లాంటి సినిమాలో సహజసిద్ధమైన పాత్రల గురించి గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంతలా తెలుగు తెరపై ఈ జనరేషన్ లో చెరగని ముద్ర వేసిన అనుష్క.. చాలాసార్లు సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసి తన తోటి హీరోయిన్లకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. అందుకే ఇప్పుడు హీరోయిన్లు కూడా తరచూ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. అనుష్క పోషించిన తరహా పాత్రలు చేయాలని ఉందని, అలాంటి అవకాశం వస్తే వదులుకోమని చెబుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకు అనుష్క చేసిన పాత్రలు లాంటివి చేయడానికి మీరు సిద్ధమేనా అనే ప్రశ్న ఎదురైంది. అయితే, ఈ ప్రశ్నకు అందరి హీరోయిన్లలా కాకుండా కాస్త భిన్నంగా స్పందించిన రకుల్ చిన్న స్వీట్ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇంతకూ రకుల్ ఏమన్నదంటే.. పక్కింటి అమ్మాయి పాత్రలకు, మోడ్రన్ పాత్రలకు నేను సరిగ్గా సరిపోతానని.. నా వయస్సు శరీరాకృతి దానికి సూట్ అవుతాయని.. అరుంధతి లాంటి నాయికా ప్రాధాన్యత పాత్రలు నేనిప్పుడు చేయలేనని.. కొన్ని పాత్రలకు వయస్సు హోదా అనుభవం అవసరమని.. అవి అనుష్క లాంటి సీనియర్ నటులు మాత్రమే చేయగలరని.. నేను చేస్తే కామెడీగా ఉంటుందని రకుల్ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో రకుల్ చెప్పిన మాటలు నిజమేనని అనిపించినా.. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు మాత్రం రకుల్ మాటల్లోని అసలైన అర్థం ఇదే అంటూ వేరే కథనాలు ప్రచురిస్తున్నాయి. రకుల్ ఆ పాత్రలు నాకు సూట్ కావు అంటూ కావాలనే అనుష్క వయస్సు గురించి మాట్లాడిందని, తనలాంటి యంగ్ హీరోయిన్ తో పోలిస్తే అనుష్కకి వయస్సు పెరిగిపోయిందని, ఏజ్ బార్ అయిపోయిందని ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేసిందని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరి దీనికి రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

User Comments