బోయ‌పాటికి ఎందుకు హ్యాండిస్తున్నారు..?

చిన్న ద‌ర్శ‌కుడు కాదు.. పైగా కావాల్సినంత మాస్ ఇమేజ్ ఉంది.. ఆయ‌న సినిమా చేస్తే బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతుంద‌నే న‌మ్మ‌కం కూడా ఉంది.. కానీ ఏం చేస్తాం.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అంటారు క‌దా అలా ఉంది ఇప్పుడు బోయ‌పాటి శీను ప‌రిస్థితి. ఈయ‌నతో సినిమా అంటే ఏ స్టార్ అయినా ఎగిరి గంతేయాలి కానీ ఇప్పుడు అలా జ‌ర‌గ‌డం లేదు. ఎందుకో తెలియ‌దు కానీ స్టార్ హీరోలు మాత్రం వ‌ర‌స‌గా ఈ ద‌ర్శ‌కుడికి హ్యాండిస్తున్నారు. జ‌య జాన‌కీ నాయ‌కా త‌ర్వాత వ‌ర‌స‌గా మూడు సినిమాలు అనౌన్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో మ‌హేశ్ ఈ మధ్యే నిర్మొహ‌మాటంగా బోయ‌పాటి శీను సినిమాకి నో చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇక బాల‌య్య కూడా మ‌రో ఏడాది వ‌ర‌కు బిజీ.. చిరంజీవి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సైరా పూర్తి చేయ‌డానికి సంవత్సరం పైనే పట్టేట్టు ఉంది.. దాంతో బోయ‌పాటి ఇప్పుడు ఖాళీ అయిపోయాడు.

ఈయ‌న‌కు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి కానీ అంతే వ‌ర‌స‌గా స్టార్ హీరోలు హ్యాండ్ కూడా ఇస్తున్నారు.
ఇప్ప‌టికిప్పుడు బోయ‌పాటి కోసం ఖాళీ అయ్యే హీరోలు కూడా ఎవ‌రూ లేరు. అఖిల్ తో సినిమా ఉంద‌నే వార్త‌లు వ‌చ్చినా ఇందులో ఏ మాత్రం నిజం లేద‌ని తేలిపోయింది. ఇక రామ్ చ‌ర‌ణ్ తో సినిమా ఉంద‌నే ప్ర‌చారం గ‌ట్టిగానే జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ లోనే ఈ చిత్ర ముహూర్తం కూడా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కే వరకు అనుమానమే. రంగ‌స్థ‌లంతో ప్ర‌స్తుతం బిజీగా ఉన్న చ‌ర‌ణ్.. ఆ త‌ర్వాత సైరా నిర్మాణంపై దృష్టి పెట్ట‌నున్నాడు. రంగ‌స్థ‌లం త‌ర్వాత కొర‌టాల సినిమా అనౌన్స్ చేసినా.. అది ప‌ట్టాలెక్కే వ‌ర‌కు మ‌రో ఆర్నెళ్ల‌కు పైగానే ప‌డుతుంది. మ‌రోవైపు రాజ‌మౌళి కూడా చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే బోయ‌పాటా.. రాజ‌మౌళా అనే ప్ర‌శ్న వ‌స్తే చ‌ర‌ణ్ వేసే అడుగు జ‌క్క‌న్న వైపు ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మొత్తానికి బోయ‌పాటి శీను ప‌రిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా ఉంది.