రామ్ చరణ్ బోయపాటి సెట్ కి వెళ్తున్నాడు

Last Updated on by

ఇప్పుడు అప్పుడూ అనుకుంటూ ఏడాదిన్న‌ర‌కు పైగా రంగ‌స్థ‌లంకే రామ్ చ‌ర‌ణ్ ను లాక్ చేసాడు సుకుమార్. అప్పుడెప్పుడో 2017 ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ చిత్రంపైనే ఫోక‌స్ పెట్టాడు చ‌ర‌ణ్. గ‌తేడాదే పూర్తి చేస్తాన‌ని చెప్పిన సుకుమార్.. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాను విడుద‌ల చేయ‌లేదు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ఏడాదిన్న‌ర‌గా రంగ‌స్థ‌లంతో కొన‌సాగుతున్న త‌న అనుబంధానికి తెరేసాడు చ‌ర‌ణ్. ఇక ఇప్పుడు కొత్త సెట్ లోకి అడుగు పెడుతున్నాడు. మార్చ్ 6 నుంచి బోయ‌పాటి శీను సినిమాతో బిజీ కానున్నాడు మెగా వార‌సుడు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కోసం నెల రోజులుగా వేచి చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. చ‌ర‌ణ్ లేకుండానే తొలి షెడ్యూల్ పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు. రెండో షెడ్యూల్ కు రంగం సిద్ధ‌మైంది. ఇది హైద‌రాబాద్ లోనే జ‌ర‌గ‌నుంది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా బోయ‌పాటి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. మ‌హేష్ తో భ‌ర‌త్ అనే నేనులో న‌టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని కేవ‌లం ఆర్నెళ్ల‌లో పూర్తిచేసి.. ద‌స‌రా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్ లో ప్రతీ సినిమాకు క‌నీసం ఏడాదికి పైగా టైమ్ తీసుకున్న బోయ‌పాటి.. చ‌ర‌ణ్ సినిమాను ఇంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌డం అనేది రికార్డే. అందుకే అంద‌ర్లోనూ ఇదే ఆస‌క్తి క‌నిపిస్తుంది.

బోయ‌పాటి సినిమా చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ సినిమాను పోలి ఉంటుంద‌ని తెలుస్తుంది. ఈ క‌థ‌ను ఇప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్లుగా బోయ‌పాటి త‌న స్టైల్ లో నాటి గ్యాంగ్ లీడ‌ర్ ను మార్చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. దానికి రాజ‌స్థాన్ బ్యాక్ డ్రాప్ ఇస్తున్నాడ‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం కూడా లేక‌పోలేదు. బోయ‌పాటి సినిమాలో త‌మిళ హీరో ప్ర‌శాంత్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇది చ‌ర‌ణ్ కు పెద్ద‌న్న‌య్య పాత్ర. ఇక ఇప్పుడు అందాల రాక్ష‌సి ఫేమ్ న‌వీన్ చంద్ర మ‌రో అన్న‌య్య‌గా ఎంపిక‌య్యాడు. ఇత‌డికి జోడీగా అన‌న్య న‌టిస్తుంది. గ్యాంగ్ లీడ‌ర్ లోనూ చిరంజీవికి ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉంటారు. ఒక‌టి ముర‌ళి మోహ‌న్.. మ‌రొక‌రు శ‌ర‌త్ కుమార్. ఇప్పుడు బోయ‌పాటి సినిమాలోనూ ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉన్నారు. ఇక విల‌న్ గా అందులో రావుగోపాల‌రావు ర‌ప్ఫాడిస్తే.. ఇక్క‌డ వివేక్ ఒబేరాయ్ న‌టిస్తున్నాడు. మొత్తానికి గ్యాంగ్ లీడ‌ర్ నే ఇప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్లు తీస్తున్నాడ‌నే ప్ర‌చారం అయితే గ‌ట్టిగానే జ‌రుగుతుంది. మ‌రోవైపు గ్యాంగ్ లీడ‌ర్ లాంటి మాస్ సినిమాకు బోయ‌పాటి లాంటి మాస్ డైరెక్ట‌ర్ త‌గిలితే వ‌చ్చేర‌చ్చ మామూలుగా  ఉండ‌దు క‌దా..! చూద్దాం ఏం జ‌రుగుతుందో..?

User Comments