రామ్ చ‌ర‌ణ్.. ఇన్నేళ్లు త‌ప్పెవ‌రిది..?

Last Updated on by

రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు దాటిపోయింది. ఇన్నాళ్ళూ.. ఇన్నేళ్లు సినిమాలు చేస్తూనే ఉన్నాడు మెగా వార‌సుడు. ఇప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ అంటే మెగాస్టార్ త‌న‌యుడు అనే అంటారు. ఓ ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చాడు.. మూడు నాలుగు విజ‌యాలు ఉన్నాయి.. క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ స్టార్ రేంజ్ ఉంది.. అన్నీ ఉన్నా కూడా న‌టుడిగా మాత్రం ఇప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ చాలా ఎత్తు ఎదగాలి. అది జ‌ర‌గ‌లేదు. ప‌దేళ్లుగా ఎన్ని సినిమాలు చేసినా కూడా రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా ఎదిగింది కూడా లేదు. ఈ విష‌యాన్ని తాను కూడా ఒప్పుకున్నాడు. న‌టుడిగా ఇంకెప్ప‌టికీ ఎద‌గ‌డు.. ఇలాగే రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ ఉండాల్సిందే అంటూ చ‌ర‌ణ్ పై ముద్ర వేసారు కూడా. ఇలాంటి టైమ్ లో వ‌చ్చింది రంగ‌స్థ‌లం. ఈ చిత్రం చూసిన ప్ర‌తీ ఒక్క‌రు ద‌ర్శ‌కుడు సుకుమార్ తో పాటు అంతే స‌మానంగా రామ్ చ‌ర‌ణ్ ను కూడా పొగుడుతున్నారు. అస‌లు ఇందులో ఈయ‌న న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లంటూ ఉండ‌రు. ఓ ద‌ర్శ‌కున్ని న‌మ్మితే.. ఇంత గుడ్డిగా న‌మ్మేస్తారా అంటూ అంతా షాక్ అయిపోతున్నారు. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరో త‌న ఇమేజ్ అంతా బ్యాగులో మూట‌గ‌ట్టేసి అట‌క మీద పెట్టేసాడు.

అన్నీ మ‌రిచిపోయి సిట్టిబాబు అనే పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసాడు. ఇన్నేళ్ల నుంచి త‌న‌కు దూరంగా ఉంటున్న న‌టుడు అనే బిరుదును ఇప్పుడు స‌గ‌ర్వంగా అందుకుంటున్నాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ న‌ట‌న‌ను చూసి ఇప్పుడు అంతా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంద‌రికీ. వ‌స్తున్న అనుమానం ఇదే మ‌రి. ఇన్నాళ్లూ చ‌ర‌ణ్ లోని న‌టున్ని ఏ ద‌ర్శ‌కుడు వాడుకోలేదా.. లేదంటే ద‌ర్శ‌కులంతా మూకుమ్మ‌డిగా చ‌ర‌ణ్ ను కేవ‌లం రొటీన్ మాస్ సినిమాల‌కే ప‌రిమితం చేసారా..? ర‌ంగ‌స్థ‌లం లాంటి క‌థ ఎప్పుడో ప‌డుంటే ఈ పాటికి చ‌ర‌ణ్ ఓ రేంజ్ లో ఉండేవాడుగా న‌టుడిగా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా న‌టుడిగా చాలా ఎదిగాడు. ఈ విష‌యంలో ఎవ‌రికి ఏ అనుమానాలున్నా రంగ‌స్థ‌లం చూస్తే స‌రిపోతుంది. ఈ సినిమా చూసిన త‌ర్వాత త‌ప్పు ఎవ‌రిదో అర్థం కావ‌ట్లేదు. ద‌ర్శ‌కులే కొత్త క‌థ‌లు ఈయ‌న ద‌గ్గ‌రికి తీసుకురాలేదేమో మ‌రి..? ఇప్ప‌ట్నుంచైనా చ‌ర‌ణ్ కోసం కొత్త క‌థ‌లు సిద్ధం చేసి ఆయ‌న త‌లుపు తడతారని ఆశిద్దాం.

User Comments