రంగస్థలం రివ్యూ

Last Updated on by

రివ్యూ: రంగస్థలం
నటీనటులు: రామ్ చరణ్, సమంత, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు..
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
కథ, కథనం, దర్శకుడు: సుకుమార్

రంగస్థలం.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఇదే పేరు. రామ్ చరణ్ లాంటి స్టార్ తో సుకుమార్ చేసిన ఓ భిన్నమైన ప్రయోగం ఈ చిత్రం. మరి నిజంగానే రంగస్థలం అంచనాలు అందుకుందా..? చరణ్ కోరుకున్న విజయం తీసుకొస్తుందా..?

కథ:
చిట్టిబాబు(రామ్ చరణ్) రంగస్థలం అనే ఊళ్లో పొలాలకు నీళ్లు తడిపేవాడు. అతడికి కాస్త చెవుడు ఉంటుంది. అదే ఊరు ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతి(జగపతిబాబు). ఆయన ఆధీనంలోనే ఊరు ఉంటుంది. 30 ఏళ్లుగా ఒక్కడే ప్రెసిడెంట్. ఊళ్లో ఎంత అన్యాయం జరుగుతున్నా ఎవరూ నోరు మెదపరు. అలాంటి సమయంలో చిట్టిబాబు అన్న కుమార్ బాబు(ఆది పినిశెట్టి) వచ్చి అన్యాయాలను అడుగుతాడు. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు. ఆయనకు ఎమ్మెల్యే(ప్రకాశ్ రాజ్) సాయం చేస్తాడు. కానీ అనుకోని రీతిలో రంగస్థలంలో సిట్టిబాబు జీవితం మారిపోతుంది. అసలు ఏం జరుగుతుంది..? అసలు రామలక్ష్మి(సమంత) ఎవరు..? రంగమ్మత్త(అనసూయ)తో సిట్టిబాబుకు లింక్ ఏంటి..? ఇదంతా మిగిలిన కథ..

కథనం:
రంగస్థలం.. పేరులోనే ఉంది ఇక్కడ జరిగేదంతా నాటకం అని. ఓ ఊరు.. అందులోని వివిధ పాత్రలు.. అక్కడే జరిగే అన్యాయాలు.. రాజకీయాలు ఇవే రంగస్థలం కథ. సుకుమార్ కొత్తగా రాసుకున్నదేం కాదు ఈ కథ. ఇదివరకు చూసిందే. కాకపోతే ఇందులో చాలా కొత్తదనం ఉంది. అసలు కొత్తదనం కథ 80ల్లో సాగడమే. దానికి తోడు హీరోకు చెవుడు.. ఈ రెండు చాలు రంగస్థలం చాలా ఆసక్తికరంగా అనిపించడానికి. తాను రాసుకున్న పాయింట్స్ ను ఎక్కడా పక్కదారి పట్టించలేదు సుకుమార్. ఏం అనుకున్నాడో.. ఎలా తీయాలనుకున్నాడో అదే తీసి చూపించాడు. ఫస్ట్ సీన్ నుంచే హీరోను హీరో కాదు.. ఓ పాత్రలా పరిచయం చేసాడు. ఇక్కడ ఓ నాటకం జరుగుతుంది.. అక్కడ అంతా పాత్రదారులే కానీ సూత్ర దారి మాత్రం దేవుడే అని చూపించాడు సుకుమార్. ఇదే పంథాలో కథ వెళ్లింది కూడా. ఎక్కడా రామ్ చరణ్ హీరోయిజం కనిపించదు. ఆయన చెవుడునే కథలో ఎంటర్ టైనింగ్ గా మార్చుకున్నాడు సుకుమార్. ఫస్టాఫ్ లో చాలా సీన్స్ ఇలాగే ఫన్ జనరేట్ చేసాయి. సమంతతో వచ్చే లవ్ ట్రాక్ కూడా ఎంటర్ టైనింగ్ గానే ఉంటుంది. ఇక అనసూయతో వచ్చే ప్రతీ సీన్ సినిమాకు కీలకమే. ఆమె నుంచి ఇలాంటి పాత్ర ఊహించడం చాలా కష్టం. గ్లామర్ డాల్ గా చూడటం అలవాటు చేసుకున్న అనసూయతో రంగమ్మత్త క్యారెక్టర్ కు ఒప్పించి.. ఆమెతో సుకుమార్ చేయించుకున్న తీరు అద్భుతమే.

ఫస్టాఫ్ చాలా వేగంగా వెళ్లిపోతుంది. గంటన్నర ఉన్నా కూడా బోర్ అనిపించదు. కథలో లీనమైపోతాం. ఒక్కసారి ఊళ్లో తిరుగుబాటు మొదలైన తర్వాత కాస్త తగ్గుతుంది. సెకండాఫ్ లో కాస్త కథ నెమ్మదించిన మాట వాస్తవమే అయినా కథలో లీనమైపోయిన తర్వాత అది మనకు కనిపించదు. ఎమోషన్స్ తో కనెక్ట్ అయిపోతాం. అంతగా ఈ సినిమాను మెస్మరైజ్ చేసాడు సుకుమార్. స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో కట్టి పడేసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో రెండు మూడు సీన్లు అయితే కన్నీరు పెట్టించాడు. క్లైమాక్స్ మళ్లీ నిలబెట్టింది సినిమాను. అప్పటి వరకు కాస్త స్లో పేజ్ లో వెళ్లిన సినిమా కాస్తా చివర్లో మళ్ళీ బాగానే లేచింది. ఓవరాల్ గా రంగస్థలం ఓ మంచి ఎక్స్ పీరియన్స్. చూసి ఎంజాయ్ చేయడం తప్ప.. ఎలా ఉంది అని అడగలేని మంచి సినిమా.

నటీనటులు:
రామ్ చరణ్ నటించాడు అనేకంటే జీవించాడు అని చెప్పాలి. ఇన్నాళ్లూ ఆయన్ని నటుడిగా గుర్తించడానికి కూడా చాలా మందికి మనసు రాలేదు. ఇప్పుడు రంగస్థలం చూసిన తర్వాత చరణ్ లోని నటుడు ఎలా ఉంటాడో అందరికీ అర్థమైపోయింది. ఆయన పాత్రను ఓన్ చేసుకున్న విధానం అద్భుతం. ప్రతీ సీన్ లోనూ జీవించాడు అంతే. ఇక రామలక్ష్మిగా సమంత కూడా ఒదిగిపోయింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా మారిపోయింది. ఆది పినిశెట్టికి మంచి పాత్ర పడింది. చరణ్ తర్వాత బాగా ఎలివేట్ అయిన క్యారెక్టర్ ఇదే. అనసూయ ఊహించని ప్యాకేజ్ ఈ చిత్రంలో. రంగమ్మత్త అంటే అదేదో వ్యాంప్ క్యారెక్టర్ అనుకున్న వాళ్లకు షాక్ ఇచ్చాడు సుకుమార్. చాలా కీలక పాత్ర ఇచ్చాడు. అనసూయ కూడా ఈ పాత్రకు న్యాయం చేసింది. ప్రకాశ్ రాజ్.. జగపతిబాబు బాగా చేసారు.

టెక్నికల్ టీం:
దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టాడు అంటే కూడా తక్కువే అవుతుంది. అంతగా ఆర్ఆర్ తో సినిమా స్థాయిని పెంచేసాడు డిఎస్పీ. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే కేవలం దేవీ ఆర్ఆర్ వల్లే మరో రేంజ్ కు వెళ్లిపోయాయి. పాటలు బాగున్నాయి. జిగేల్ రాణి సాంగ్ థియేటర్స్ లో అభిమానులతో విజిల్స్ వేయించడం ఖాయం. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి చెప్పడానికేం లేదు. ఎక్స్ ట్రీమ్ గా ఉన్నాయి విజువల్స్ అన్నీ. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. చంద్రబోస్ లిరిక్స్ చాలా బాగున్నాయి. దర్శకుడిగా సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కథను ఎంచుకున్నపుడే ఆయన సగం విజయం సాధించాడు. అయితే కథపై దృష్టి పెట్టి కాస్త నెమ్మదిగా సాగే కథనాన్ని పక్కన బెట్టేసాడు సుకుమార్.

చివరగా:
పలు పాత్రల ఈ రంగస్థలం.. చూసేందుకు కడు కమనీయం..

రేటింగ్: 3.25/5

User Comments