RRRలో అగ్గిపిడుగు యుద్ధం

ఎస్.ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. తాజాగా ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ అగ్గిపిడుగు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా ఆర్.ఎఫ్.సీలో  సీతారామ‌రాజుని బ్రిటీష్ ప్ర‌భుత్వ న్యాయ స్థానం ముందు ప్ర‌వేశ పెట్టిన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారుట‌.

ఇక్క‌డే అగ్గిపిడుగు  గుండెను చీల్చి  బ్రిటీష‌ర్ల‌కు తెలుగోడి సామ‌ర్ధ్యాన్ని చాటి చెప్పాడు. దుక్కి దున్నావా?   నారు పోసావా?  మొక్క నాటావా?  నీరు పోసావా? అంటూ తెల్ల దొర‌ల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టించాడు. ఓ యుద్ద వాతావ‌ర‌ణాన్నే సృష్టించి విప్ల‌వ‌యోధుడిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు. ప్ర‌స్తుతం ఇలాంటి స‌న్నివేశాల్నే చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. చ‌ర‌ణ్ విప్ల‌వ‌యోధుడి పాత్ర‌లో ఒదిగిపోయిన‌ట్లు సెట్స్ ని విజిట్ చేసిన వారు చెబుతున్నారు. నిజంగా అగ్గిపిడుగు పాత్ర‌లో చ‌ర‌ణ్ వేషాధార‌ణ అద్భుతంగా ఉంద‌ని  ప్ర‌శంసిస్తున్నారు. త‌ల‌పాగా..  రింగు రింగుల జుట్టు.. గుబురు గ‌డ్డం.. కోర మీసాలు అచ్చంగా సీతారామ‌రాజునే త‌లపిస్తున్నాడ‌ని అంటున్నారు.

సినిమాలో ఈ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని ఈ సంద‌ర్భంగా యూనిట్  ధీమాను వ్య‌క్తం చేసింది. ఇక మ‌రో పోరాట యోధుడు కొమ‌రం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కనిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ పాత్ర‌కు సంబంధించి కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. తార‌క్ తో చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన నేప‌థ్యంలో చ‌ర‌ణ్ పై చిత్రీక‌ర‌ణ షురూ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక డిసెంబ‌ర్ 31న న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన ప్ర‌చార చిత్రాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.