షాక్.. చెర్రీ అభిమానిగా ఫేమస్ అయిన బుడతడు మృతి

Ram Charans Fan Mini Magadeera NoMore

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వీరాభిమానిగా ఫేమస్ అయిన పరశురామ్ అనే బాలుడు తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందాడనే న్యూస్ ఇప్పుడు షాక్ కి గురి చేస్తోంది. అయినా అది నిజమేనని తేలడంతో చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడటానికి చిన్న కుర్రాడే అయినా.. పరశురామ్ నోరు తెరిస్తే పెద్ద పెద్ద సినిమా డైలాగులు కూడా సింపుల్ గా పేలిపోతాయి. ముఖ్యంగా గుక్కతిప్పుకోకుండా డైలాగులు చెప్పడంలోనూ, తనదైన డ్యాన్సులతో అదరగొట్టడంలోనూ పరశురామ్ కు మంచి పేరు ఉంది. అంతేకాకుండా తనదైన హావభావాలతో డైలాగులను బుల్లెట్లుగా వదలడంతోనే ఈ బుడతడు బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్నాడు.
అయితే, ఏం చేసినా ఎక్కువగా రామ్ చరణ్ సినిమాల్లోయే చేయడం, చెర్రీ సినిమా డైలాగ్స్ ను వీరాభిమానంతో చెప్పడంతో పరశురామ్ రామ్ చరణ్ అభిమానిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రధానంగా రామ్ చరణ్ మగధీర సినిమాలోని పాపులర్ డైలాగులను అద్భుతంగా చెప్పడంతో పరశురామ్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా ఏకంగా రామ్ చరణ్ దృష్టిలోనే పడ్డాడు. అందుకే స్వయంగా రామ్ చరణే 2015 మార్చి 15న తన ఇంటికి పరశురామ్ ను పిలిపించుకుని అభినందించడం జరిగింది. ఇదే సమయంలో పరశురామ్ బాగోగులు చూస్తానని, చదువు చెప్పేస్తానని చెర్రీ హామీ ఇవ్వడమే కాకుండా.. తర్వాత పరశురామ్ గ్రామంలోనే చదువుకునేలా చెర్రీ ఏర్పాట్లు చేయించాడని సమాచారం.
అయితే, ఇప్పుడు అదే పరశురామ్ అనారోగ్యంతో మృతి చెందాడని తెలియడంతో చాలామంది బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే, గద్వాల్ దగ్గర అయిజ గ్రామానికి చెందిన బోయ మల్దకల్, ముద్దమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పరశురామ్ మొదటివాడని తెలుస్తోంది. ఈ క్రమంలో కూలీ డబ్బులతో జీవనం సాగించే ఈ కుటుంబంలో పరశురామ్ చురుకైన కుర్రాడిగా పెరుగుతూనే రామ్ చరణ్ అభిమానిగా బోలెడంత పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఈ చిన్నారికి జబ్బు చేస్తే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం అందించలేకపోవడంతో తాజాగా మృతి చెందాడని సమాచారం. ఈ విషయం రామ్ చరణ్ దాకా వెళ్ళకపోవడంతోనే ఇంత ఘోరం జరిగిందని స్థానిక అభిమానులు అంటున్నట్లు తెలుస్తోంది.