వ‌ర్మ బ‌యోపిక్.. టైగ‌ర్ కేసీఆర్

ఇటీవ‌లే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` తో బ్లాక్ బాస్ట‌ర్ అందుకున్నాడు. ఆ వెంట‌నే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన నేర‌స్తుడి జీవిత క‌థ ఆధారంగా `కోబ్రా` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ చిత్రంతో వ‌ర్మ న‌టుడిగాను ప‌రిచ‌యం అవుతున్నాడు. తాజాగా వ‌ర్మ మ‌రో బ‌యోపిక్ కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని వ‌ర్మ ట్విట‌ర్ ద్వారావెల్ల‌డిస్తూ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసారు. పోస్ట‌ర్ లో `టైగ‌ర్ కేసీఆర్` అని రాసి ఉంది. సినిమా టైటిల్ అదే అయి ఉండొచ్చ‌ని తెలుస్తోంది. `ఆడు తెలంగాణ తెస్తానంటే అంద‌రూ న‌వ్విండ్రు`. `ది అగ్ర‌సివ్ గాంధీ` అన్న క్యాప్ష‌న్ ను పోస్ట‌ర్లో రాసారు.

ఆంధ్ర ప్ర‌జ‌లు తెలంగాణ వాసుల‌ను త‌క్కువ చేసి చూడ‌టం త‌ట్టుకోలేక కేసీఆర్ ఏం చేశార‌న్న కోణంలో క‌థ న‌డుస్తుంద‌ని వెల్ల‌డించారు. దీంతో వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నానికి తెర లేపార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి, కేసీఆర్ కి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదాలున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ త‌రుపున వ‌ర్మ వ‌కాల్తా పుచ్చుకుని సినిమా చేయ‌డం ఆ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఇంకెంత అగ్గి రాజేస్తుందో. అటు రాష్ర్టాన్ని విడ‌గొట్టిన నాయ‌కుడిగా కేసీఆర్ అంటే మండిప‌డే వారెంతో మంది. ఈ నేప‌థ్యంలో ఈ బ‌యోపిక్ మ‌రింత వివాదం కావ‌డం ఖాయం.