ఇస్మార్ట్ శంక‌ర్ కాదా.. ఇస్మార్ట్ గ‌జినీనా?!

Last Updated on by

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తొలి తొలిసారి క‌లిసి చేస్తున్న సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. పూరి, ఛార్మి క‌లిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లైంది. నిధి అగ‌ర్వాల్‌. న‌భా న‌టేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ప‌క్కా హైద‌రాబాదీ యువ‌కుడిగా తెలంగాణ స్లాంగ్‌లో రామ్ డైలాగ్‌లు చెప్ప‌నున్న ఈ సినిమాపై పూరి జ‌గ‌న్నాథ్‌, హీరో రామ్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. ఈ సినిమా రామ్ కంటే పూరీకే కీల‌కం. గ‌త కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పూరిజ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌నుకుంటున్నారు. అందుకే ఈ సినిమాపై ఆయ‌న ఎక్కువ ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

టైటిల్‌కు త‌గ్గ‌ట్టే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌లో `డ‌బుల్ దిమాక్ హైద్రాబాదీ..డ‌బుల్ సిమ్ కార్డ్‌` అంటూ కొత్త‌గా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ అక్క‌డే క‌థ విష‌యంలో దొరికి పోయాడ‌ని తెలుస్తోంది. ఫ‌స్ట్‌లుక్ సంద‌ర్భంగా పూరీ వ‌దిలిన `డ‌బుల్ దిమాక్ హైద్రాబాదీ..డ‌బుల్ సిమ్ కార్డ్‌` ట్యాగ్‌లైన్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` క‌థేంటో చెప్పేసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది హీరో గ‌తం మ‌ర్చిపోయే క‌థ అని గ‌తం గుర్తొచ్చిన‌ప్పుడు మాత్ర‌మే హీరో ఇస్మార్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ విల‌న్‌ల‌పై త‌న ప్ర‌తాపం చూపిస్తుంటాడ‌ని, గ‌తం మ‌ర్చిపోయిన స‌మ‌యంలో వాళ్ల‌ని గుర్తుపట్ట‌డ‌ని, ఇదే సినిమాలో న‌వ్వులు పూయించే ఆంశం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే పూరీ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ ప‌క్కా అన్న‌ట్టే. గ‌తం మ‌ర్చిపోవ‌డం…మ‌ళ్లీ గుర్తు చేసుకుంటూ త‌న ప్రేయ‌సిని చంపిన వారిపై ప‌గ‌తీర్చుకోవ‌డం అనే కాన్సెప్ట్‌తో కొన్నేళ్ల క్రితం `గ‌జిని` సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ ఈదే క‌థ‌కు తెలంగాణ హంగులు అద్ది పూరీ ఇస్మార్ట్‌గా క‌వ‌ర్ చేస్తున్నాడ‌ని తెలిసిపోతోంది. ఈ విష‌యం తెలిసిన వాళ్లు ఇది `ఇస్మార్ట్ శంక‌ర్‌` కాదు ఇస్మార్ట్ గ‌జిని అని పెట్టుంటే బాగుండేది క‌దా అంటూ పూరీపై సెటైర్లు వేస్తున్నార‌ట‌.

User Comments