`ఐస్ క్రీమ్-3` కోసం వ‌ర్మ శిష్యుడు!

Last Updated on by

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ‌- తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఐస్ క్రీమ్` ప్రాంఛైజీ గురించి తెలిసిందే. హార‌ర్ .. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన `ఐస్ క్రీమ్-1`, `ఐస్ క్రీమ్-2` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించాయో కూడా విధిత‌మే. అయితే హిందీ డ‌బ్బింగ్ రైట్స్, వ‌ర్మ బ్రాండ్ తో శాటిలైట్ రూపంలో ఆసినిమాకు పెట్టిన పెట్టుబ‌డి పోగా కొంత లాభాలు తీసుకొచ్చిన మాట మాత్రం వాస్త‌వం. ఆ సినిమాల ప్ర‌చార స‌మ‌యంలో ఐస్ క్రీమ్ సీక్వెల్స్  అనంతం అంటూ బ‌హిరంగంగానే చెప్పాడు వ‌ర్మ‌. తాజాగా `ఐస్ క్రీమ్ -3`కి రంగం సిద్ధం చేస్తున్నట్లు  లీకులందాయి. అయితే ఈసారి పార్ట్ -3 బాధ్య‌త‌ల్ని వ‌ర్మ త‌న శిష్యుడికి అప్ప‌గించిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

వ‌ర్మ కంపెనీ ప్రొడ‌క్ష‌న్స్ లో ఐదేళ్లుగా ప‌నిచేస్తోన్న అక్ష‌య్ అనే కుర్రాడిని డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాడుట‌. క‌థ‌, క‌థ‌నం, డైలాగులు ఇప్ప‌టికే సిద్దం చేసాడుట‌. ద‌ర్శ‌క‌త్వ‌ ప‌ర్య‌వేక్ష‌ణ మాత్రం వ‌ర్మ చూసుకోనున్నాడుట‌. నిర్మాత‌గా యధావిధిగా తుమ్మ‌ల‌ప‌ల్లి కొన‌సాగ‌నున్నారుట‌. వాస్త‌వానికి తుమ్మ‌ల‌ప‌ల్లికి వ‌ర్మ `ఐస్ క్రీమ్` ల‌తోనే నిర్మాత‌గా బాగా ఫోక‌స్ లోకి వ‌చ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌న చాలా స‌మావేశాల్లో బ‌హిరంగంగానే చెప్పారు. అంత‌కముందు వంద‌ల‌కు పైగా డ‌బ్బింగ్ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధిక అనువాద సినిమాలు అందించిన నిర్మాత‌గాను తుమ్మ‌ల‌ప‌ల్లికి ఓ రికార్డు ఉంది. తాజాగా  మ‌రోసారి `ఐస్ క్రీమ్-3` తో ఆయ‌న పేరు సోష‌ల్ మీడియాలో మార్మోగిపోవ‌డం ఖాయం.

User Comments