ఫస్ట్ టైమ్.. సోషల్ అనే వెబ్ సిరీస్ లో రానా..!

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాహుబలి పుణ్యమా అని నటుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మధ్యలో ఘాజి లాంటి సినిమాతో నేషనల్ వైడ్ గా అలరించిన రానా.. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మరోసారి సత్తా చాటాడనే చెప్పొచ్చు. ఇదే సమయంలో బుల్లితెరపై కూడా అడుగుపెట్టిన రానా ‘వియూ’ సంస్థ వారి ‘నెం.1 యారి’ టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ.. పనే ప్రపంచం అన్నట్లు బిజీబిజీగా గడిపేస్తూ అంతకంతకూ ఎదిగిపోతున్నాడనే అనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రానా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడని తెలియడం సంచలనంగా మారింది. అది కూడా చివరకు రానా తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడనే న్యూస్ కావడం హాట్ టాపిక్ అనే అనాలి. అసలు విషయంలోకి వెళితే, రానాతో నెం.1 యారి టాక్ షో నిర్వహిస్తోన్న వియా సంస్థే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసిందని సమాచారం. ప్రస్తుతం స్టార్స్ అందరూ వెబ్ సిరీస్ బాట పట్టడంతో.. వియూ ఏకంగా రానా లాంటి ఫేమ్ ఉన్న స్టార్ ను దింపి ఓ సరికొత్త వెబ్ సిరీస్ కు రంగం సిద్ధం చేసిందట. ఈ మేరకు ‘సోషల్’ అనే పేరుతో వియూ సంస్థ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో రానాతో పాటు మరో నటుడు నవీన్ కస్తూరియా నటించబోతున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సోషల్ మీడియాకు విపరీతంగా అలవాటు పడిన యువత దాని కారణంగా ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంతో కూడుకున్న కథాంశంతో ఈ ‘సోషల్’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారని టాక్ బయటకు రావడం విశేషం. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ లో కిడ్నాప్ కు గురైన తన చెల్లెలి కోసం అన్వేషించే అన్న పాత్రలో నవీన్ నటిస్తుంటే.. మన రానా మరో కీలక పాత్రలో కనిపిస్తాడని తెలియడం గమనార్హం. మొత్తంగా ఓ థ్రిల్లర్ మూవీని తలపించే ఈ వెబ్ సిరీస్ లో మొదటి ఎపిసోడ్ ను సెప్టెంబర్ మొదటి వారంలోనే వియూ వెబ్ ఛానల్ లో ప్రసారం చేయనున్నారని తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఇదే నిజమైతే, రానా కొత్త అవతారం ఏ రేంజ్ లో కిక్ ఇస్తుందో చూడటానికి ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుందేమో.