రంగ‌స్థ‌లం.. మ‌హాన‌టి రికార్డు కలెక్షన్స్

Last Updated on by

సినిమా ఎలా ఉన్నా క్ష‌మించేయ‌డానికి ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ అంత మంచోళ్లేం కాదు. అక్క‌డ వాళ్ల‌కు సినిమా న‌చ్చ‌లేదంటే మొహం మీదే నో చెప్పి బాక్సులు రిట‌ర్న్ చేస్తారు. అంత ఓపెన్ వాళ్లు. కానీ సినిమా న‌చ్చితే మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. దానికి ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన రంగ‌స్థ‌ల‌మే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ చిత్రం విడుదల‌కు ముందు ఓవ‌ర్సీస్ లో అంచ‌నాలున్నాయి కానీ అక్క‌డ మ‌రీ రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌నే న‌మ్మ‌కం అయితే ఎవ‌రికీ లేదు. పైగా రామ్ చ‌ర‌ణ్ మార్కెట్ కూడా అక్క‌డ చాలా త‌క్కువ‌. దాంతో రంగ‌స్థ‌లం విజ‌యం సాధిస్తుందేమో అనుకున్నారు కానీ రికార్డులైతే క‌ల‌లో కూడా రావు అనుకున్నారంతా. కానీ అద్భుతం జ‌రిగింది. ఈ చిత్రం అక్క‌డ ఏకంగా 3.5 మిలియ‌న్ వ‌సూలు చేసింది. అందులో డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ దాదాపు 14 కోట్లు. అక్క‌డ ఈ చిత్రాన్ని కొన్న‌ది 9 కోట్ల‌కు. అంటే అక్ష‌రాలా 5 కోట్లు లాభం అన్న‌మాట‌. విదేశీ మార్కెట్ లో ఇంత లాభం రావ‌డం అనేది దాదాపు అసాధ్యం.

గ‌త కొన్నేళ్ల‌లో ఓవ‌ర్సీస్ లో ఇన్ని లాభాలు చూపించిన సినిమా అర్జున్ రెడ్డి. ఆ చిత్రాన్ని అక్క‌డ ల‌క్ష‌ల్లోనే కొన్నారు కానీ అది కోట్ల‌కు కోట్లు తీసుకొచ్చింది. ఇప్పుడు రంగ‌స్థ‌లంకు మ‌ళ్లీ ఆ మాయ జ‌రిగింది. ఈ జాబితాలో బాహుబ‌లి మిన‌హాయింపు. నాన్ బాహుబ‌లిలో ఇప్పుడు మ‌హాన‌టి కూడా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఓవ‌ర్సీస్ లో నిర్వాన మూవీస్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే ఈ చిత్రం అక్క‌డ 2.5 మిలియ‌న్ వ‌సూలు చేసింది. మ‌హాన‌టి లాంటి చిన్న సినిమాకు ఇది నిజంగా పెద్ద మొత్త‌మే. ఇప్ప‌టికీ అక్క‌డ మంచి వ‌సూళ్ల‌నే తీసుకొస్తుంది మ‌హాన‌టి. సావిత్రి జీవితం గురించి తెలుసుకోడానికి అక్క‌డి ప్రేక్ష‌కులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. మొత్తానికి ఓవ‌ర్సీస్ లో అర్జున్ రెడ్డి త‌ర్వాత ఆ స్థాయిలో లాభాల పంట పండించిన సినిమాలుగా రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి నిలిచాయి.

User Comments