ఆ ఐదుగురికి రంగస్థలం టర్నింగ్ పాయింట్

Last Updated on by

సుకుమార్..

సుకుమార్.. ఈయ‌న‌కు తెలుగులో ఉన్న ఇమేజ్ వేరు. అర్థం కాని హాలీవుడ్ సినిమాలు చేస్తాడ‌ని ఈయ‌న‌కు మంచి పేరుంది. ఎంత అద్భుత‌మైన సినిమాలు చేసినా కూడా ఈయ‌న‌కు హిట్లు మాత్రం చాలా త‌క్కువ‌. ఆర్య త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోలేక‌పోయాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఈయ‌న టేకింగ్ కు ఫిదా అయిపోయి మ‌ళ్లీ మ‌ళ్లీ ఆఫర్లు ఇస్తుంటారు స్టార్ హీరోలు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఇదే చేసాడు. రంగ‌స్థ‌లంతో ఈయ‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌పుడు చ‌ర‌ణ్ రిస్క్ చేస్తున్నాడా అనుకున్నారంతా..? ఇక ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌పుడు రిస్క్ అని ఫిక్స్ అయిపోయారు. లెంత్ మూడు గంట‌లు అని తెలిసిన‌పుడు సినిమా కూడా తేడా కొట్టేస్తుంద‌ని ఫిక్స్ అయిపోయారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రంగ‌స్థ‌లం ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. విడుద‌లైన తొలి షో నుంచే టాక్ అద్భుతంగా ఉంద‌ని వ‌చ్చేసింది. అస‌లు సుకుమార్ ఏంటి ఇలాంటి సినిమా చేసాడు అంటూ అంతా షాక్ అయిపోయారు.

ఎప్పుడూ అర్థం కాని సినిమాలు చేసే ఈ ద‌ర్శ‌కుడు.. రంగ‌స్థ‌లంకు మాత్రం అర‌టి పండు వ‌లిచి నోట్లో పెట్టినంత సుల‌భంగా.. స్ప‌ష్టంగా క‌థ చెప్పాడు. ఇదే అంద‌రికీ షాక్ అనుకుంటే.. ఊహించిన రేంజ్ లో ఎమోష‌న్స్ పండించాడు ఈ ద‌ర్శ‌కుడు. అస‌లు సుకుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరు చూసి ఇప్పుడు ఇండ‌స్ట్రీతో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఫిదా అయిపోతున్నారు. అస‌లు సుకుమార్ లో ఈ కోణం కూడా ఉందా అనుకుంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ముందు ల‌వ్ స్టోరీస్ చేసాడు.. ఆ త‌ర్వాత రివేంజ్ ఫార్ములాకు వ‌చ్చాడు.. ఇప్పుడు కూడా రివేంజ్ డ్రామానే తీసాడు కానీ పాత క‌థ‌నే మ‌రింత కొత్త‌గా తీసాడు. పైగా హీరోకు చెవుడు.. ఇలా ఒక్కో అంశంపై చాలా సీరియ‌స్ గా దృష్టిపెట్టి రంగ‌స్థ‌లాన్ని చిన్న‌సైజ్ సంచ‌ల‌నంగా మార్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఇప్పుడు మ‌ళ్లీ స్టార్స్ అంతా ఈ ద‌ర్శ‌కుడి వెంట ప‌డ‌టం ఖాయ‌మైపోయింది.

రామ్ చ‌ర‌ణ్..

రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు దాటిపోయింది. ఇన్నాళ్ళూ.. ఇన్నేళ్లు సినిమాలు చేస్తూనే ఉన్నాడు మెగా వార‌సుడు. ఇప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ అంటే మెగాస్టార్ త‌న‌యుడు అనే అంటారు. ఓ ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చాడు.. మూడు నాలుగు విజ‌యాలు ఉన్నాయి.. క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ స్టార్ రేంజ్ ఉంది.. అన్నీ ఉన్నా కూడా న‌టుడిగా మాత్రం ఇప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ చాలా ఎత్తు ఎదగాలి. అది జ‌ర‌గ‌లేదు. ప‌దేళ్లుగా ఎన్ని సినిమాలు చేసినా కూడా రామ్ చ‌ర‌ణ్ న‌టుడిగా ఎదిగింది కూడా లేదు. ఈ విష‌యాన్ని తాను కూడా ఒప్పుకున్నాడు. న‌టుడిగా ఇంకెప్ప‌టికీ ఎద‌గ‌డు.. ఇలాగే రొటీన్ మాస్ సినిమాలు చేస్తూ ఉండాల్సిందే అంటూ చ‌ర‌ణ్ పై ముద్ర వేసారు కూడా. ఇలాంటి టైమ్ లో వ‌చ్చింది రంగ‌స్థ‌లం. ఈ చిత్రం చూసిన ప్ర‌తీ ఒక్క‌రు ద‌ర్శ‌కుడు సుకుమార్ తో పాటు అంతే స‌మానంగా రామ్ చ‌ర‌ణ్ ను కూడా పొగుడుతున్నారు. అస‌లు ఇందులో ఈయ‌న న‌ట‌న‌కు ఫిదా కాని వాళ్లంటూ ఉండ‌రు. ఓ ద‌ర్శ‌కున్ని న‌మ్మితే.. ఇంత గుడ్డిగా న‌మ్మేస్తారా అంటూ అంతా షాక్ అయిపోతున్నారు. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరో త‌న ఇమేజ్ అంతా బ్యాగులో మూట‌గ‌ట్టేసి అట‌క మీద పెట్టేసాడు.

అన్నీ మ‌రిచిపోయి సిట్టిబాబు అనే పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసాడు. ఇన్నేళ్ల నుంచి త‌న‌కు దూరంగా ఉంటున్న న‌టుడు అనే బిరుదును ఇప్పుడు స‌గ‌ర్వంగా అందుకుంటున్నాడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ న‌ట‌న‌ను చూసి ఇప్పుడు అంతా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంద‌రికీ. వ‌స్తున్న అనుమానం ఇదే మ‌రి. ఇన్నాళ్లూ చ‌ర‌ణ్ లోని న‌టున్ని ఏ ద‌ర్శ‌కుడు వాడుకోలేదా.. లేదంటే ద‌ర్శ‌కులంతా మూకుమ్మ‌డిగా చ‌ర‌ణ్ ను కేవ‌లం రొటీన్ మాస్ సినిమాల‌కే ప‌రిమితం చేసారా..? ర‌ంగ‌స్థ‌లం లాంటి క‌థ ఎప్పుడో ప‌డుంటే ఈ పాటికి చ‌ర‌ణ్ ఓ రేంజ్ లో ఉండేవాడుగా న‌టుడిగా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు విశ్లేష‌కులు. ఏదేమైనా ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా న‌టుడిగా చాలా ఎదిగాడు. ఈ విష‌యంలో ఎవ‌రికి ఏ అనుమానాలున్నా రంగ‌స్థ‌లం చూస్తే స‌రిపోతుంది. ఈ సినిమా చూసిన త‌ర్వాత త‌ప్పు ఎవ‌రిదో అర్థం కావ‌ట్లేదు. ద‌ర్శ‌కులే కొత్త క‌థ‌లు ఈయ‌న ద‌గ్గ‌రికి తీసుకురాలేదేమో మ‌రి..? ఇప్ప‌ట్నుంచైనా చ‌ర‌ణ్ కోసం కొత్త క‌థ‌లు సిద్ధం చేసి ఆయ‌న త‌లుపు తడతారని ఆశిద్దాం.

స‌మంత..

రంగ‌స్థ‌లంలో స‌మంత లుక్ విడుద‌లైన‌పుడు గుర్తు కూడా ప‌ట్ట‌లేదు ఎవ‌రూ.. అస‌లు నాగ‌చైత‌న్య అయితే చాలా సిరాగ్గా ఎవ‌రిది అన్నాడ‌ని స్వ‌యంగా స‌మంతే చెప్పింది. అంత‌గా ఈమె లుక్ మార్చేసాడు సుకుమార్. ఇక ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే స్థాయి మాయ సినిమాలోనూ చేసాడు. రామ‌ల‌క్ష్మిగా స‌మంత పాత్ర‌ను చాలా ఎంట‌ర్ టైనింగ్ గా తీర్చిదిద్దాడు సుకుమార్. ఆమె పాత్ర‌ను ఎంట్రీ చేసిన విధానమే ప్రేక్ష‌కుల‌తో న‌వ్వు తెప్పిస్తుంది. ఆ త‌ర్వాత కూడా అదే  టెంపోలో వెళ్లిపోతుంది. రామ్ చ‌ర‌ణ్ తో ప్రేమ స‌న్నివేశాలు.. ఆరో క్లాస్ చ‌దువుకున్న అనే పొగ‌రు.. తెలియ‌ని ఓ రెబ‌ల్ ఇమేజ్.. ఇవ‌న్నీ క‌లిపి రామ‌ల‌క్ష్మి పాత్ర సూప‌ర్ గా వ‌ర్క‌వుట్ అయింది. వీటన్నింటికీ తోడు గ్లామ‌ర్ షో లో కూడా మ‌తులు పోగొట్టింది స‌మంత‌. ముఖ్యంగా క్లీవేజ్ షోల‌తో సిట్టిబాబుకే కాదు.. ప్రేక్ష‌కుల‌కు కూడా నిద్ర చెడ‌గొట్టేసింది ఈ రామ‌ల‌క్ష్మి. ఖచ్చితంగా ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత చేసిన సినిమాల‌తో పోలిస్తే రంగ‌స్థ‌లం డిఫెరెంట్ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా అక్కినేని కోడ‌లి కెరీర్ లో నిలిచిపోతుంది.

ఆది పినిశెట్టి..

ఆది పినిశెట్టి.. ఈ పేరు విన‌గానే ముందు మ‌న‌కు గుర్తొచ్చేది సరైనోడు. అప్ప‌టి వ‌ర‌కు హీరోగా ఉన్న ఈయ‌న కెరీర్ ఈ చిత్రంతో విల‌న్ గా మారింది. ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టైలిష్ విలన్ ను ప‌రిచ‌యం చేసాడు బోయ‌పాటి శీను. వైరం ధ‌నుష్ గా ర‌ప్ఫాడించాడు ఈ సినిమాలో ఆది. ఈ చిత్రం త‌ర్వాత వ‌ర‌స‌గా ఈయ‌న‌కు తెలుగులో ఆఫర్లు పెరిగాయి. త‌మిళ్ కంటే కూడా ఇప్పుడు తెలుగుపైనే ఎక్కువ‌గా ఫోకస్ చేసాడు ఈ హీరో. స‌పోర్టింగ్ రోల్స్ అయినా ప‌ర్లేదు అన్నీ చేస్తూనే ఉన్నాడు ఆది. స‌రైనోడు త‌ర్వాత నిన్నుకోరిలో మ‌రో హీరోగా న‌టించాడు. ఇందులో మంచి పాత్ర చేసాడు ఆది. ఆ త‌ర్వాత అజ్ఞాత‌వాసిలో విల‌న్ గా న‌టించినా అది డిజాస్ట‌ర్ కావ‌డంతో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు రంగ‌స్థ‌లం లోనూ అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించాడు ఆది పినిశెట్టి.

ఇందులో చ‌ర‌ణ్ అన్న‌య్య కుమార్ బాబుగా న‌టించాడు ఆది. ఊరిని బాగు చేయాల‌ని త‌పించే పాత్ర ఇది. ఈ పాత్ర‌ను సుకుమార్ తీర్చిదిద్దిన తీరు.. దాన్ని ఆది పండించిన తీరు అమోఘ‌మే. ఇక ఈ సినిమా త‌ర్వాత ఆది ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసాడ‌ని తెలుస్తుంది. ఇక‌పై విల‌న్ రోల్స్ కు ఆది ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాలు చాలు.. ఇక నుంచి హీరోగా.. లేదంటే పాజిటివ్ కారెక్ట‌ర్స్ చేయాల‌ని చూస్తున్నాడు ఆది. దీనికి త‌గ్గ‌ట్లే ఇప్పుడు చేస్తోన్న రెండు సినిమాల్లోనూ పాజిటివ్ రోల్స్ లోనే క‌నిపిస్తున్నాడు ఆది. మొత్తానికి విల‌న్ గా ఇక చాలు.. కొత్త‌గా ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తానంటున్నాడు ఈ కుర్ర హీరో. మ‌రోవైపు ప్రేక్ష‌కులు కూడా నిన్నుకోరి అంటూ ఈయ‌న్ని బాగానే ఆహ్వానిస్తున్నారు.

అన‌సూయ‌..

రంగ‌స్థ‌లం చూసిన త‌ర్వాత ఎవ‌రైనా ముందు మాట్లాడుకునేది రామ్ చ‌ర‌ణ్ గురించి.. ఆ త‌ర్వాత సుకుమార్ గురించి.. ఆ త‌ర్వాత మూడో వ్య‌క్తి ఎవ‌రు అంటే ఖచ్చితంగా స‌మంతే అనుకోవాలి. ఎందుకంటే హీరోయిన్ కాబ‌ట్టి. కానీ ఇప్పుడు మ‌రో ప‌ర్స‌న్ వ‌చ్చి చేరిపోయింది. ఆమె అన‌సూయ‌. అస‌లు రంగ‌స్థ‌లం విడుద‌ల‌కు ముందు రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ అంటే ఏదో వ్యాంప్ అనుకున్నారు. ఎందుకంటే సుకుమార్ చూపించిన ఫ‌స్ట్ లుక్ కూడా ఇలాగే ఉంది మ‌రి. పైగా అన‌సూయ‌కు కూడా ఇదే ఇమేజ్ ఉంది. క్ష‌ణంలో మంచి పాత్ర చేసినా కూడా ఇక్క‌డ విడుద‌లైన స్టిల్స్ చూసి ఖచ్చితంగా ఏదో ర‌చ్చ క్యారెక్ట‌ర్ చేయించాడు సుకుమార్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత చూస్తే అన‌సూయ‌లో ఎంత మంచి న‌టి ఉందో అంద‌రికీ అర్థ‌మైంది. అస‌లు ఈ కారెక్ట‌ర్ కోసం అన‌సూయ‌ను తీసుకోవడం నిజంగా సుకుమార్ విజ‌న్ కు దండాలు పెట్టొచ్చు. రంగ‌మ్మ అత్త‌గా ర‌ప్ఫాడించేసింది అన‌సూయ‌.

అందాలు చూపిస్తూనే అరిపించేసింది. సినిమాలోనూ అక్క‌డ‌క్క‌డా గ్లామ‌ర్ షో చేసింది అన‌సూయ‌. కానీ ఆమె పాత్ర కూడా అంతే బ‌లంగా ఉంది సినిమాలో. చెప్పాలంటే స‌మంత కంటే కూడా అన‌సూయ పాత్ర‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. అంత‌గా రాసుకున్నాడు ఈ పాత్ర‌ను సుకుమారుడు. అందుకే అత్త పాత్రైనా అడ‌గ్గానే క్యారెక్ట‌ర్ న‌చ్చి ఒప్పేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇంత చిన్న ఏజ్ లోనే అత్త‌ను చేసినందుకు అన‌సూయ‌కు సారీ కూడా చెప్పాడు సుకుమార్. కానీ ఈ పాత్ర ఇచ్చినందుకు ఇప్పుడు అన‌సూయే నిజంగా సుకుమార్ కు  రుణ‌ప‌డిపోతుందేమో..? ఎందుకంటే రంగ‌స్థ‌లంలో మెయిన్ పాత్ర‌ల్లో చ‌ర‌ణ్, ఆది త‌ర్వాత మూడోది రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌రే. ఆ త‌ర్వాతే స‌మంత పాత్ర వ‌స్తుంది.  మొత్తానికి రంగ‌స్థ‌లం ఖచ్చితంగా అన‌సూయ‌ కెరీర్ కు బూస్ట‌ప్ ఇవ్వ‌డం మాత్రం ఖాయం.

User Comments